భారత్ లో జనగణన ప్రారంభమైంది. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడగా, ప్రస్తుతం ప్రభుత్వం దీనిని అత్యాధునిక డిజిటల్ పద్ధతిలో నిర్వహించడానికి రెడీ అయింది. ఈ ప్రక్రియ ద్వారా కేవలం జనాభా లెక్కలే కాకుండా, ప్రజల ఆర్థిక స్థితిగతులు, అక్షరాస్యత,సామాజిక నేపథ్యాల వంటి కీలక గణాంకాలను సేకరిస్తారు ఇవి దేశ భవిష్యత్తు ప్రణాళికలు మరియు సంక్షేమ పథకాల రూపకల్పనకు కీలకంగా పనిచేస్తాయి. ఇక భారత ప్రధాని నరేంద్రమోడీ తన స్వయ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. నిన్న ఇంటి జాబితా మరియు గృహ సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన ‘జనాభా గణన 2027’ (Census 2027) మొదటి దశ ప్రారంభమైంది. ఈ జనాభా గణనలో, డేటా సేకరణ పూర్తిగా డిజిటల్ విధానం ద్వారా జరుగుతుండటం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, తమ ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఇది దేశ ప్రజలకు కల్పిస్తోంది. భారతదేశ ప్రజలందరూ తమ ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకుని, ఈ జనాభా గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ప్రధాని ప్రజలను విజ్ఞప్తి చేశారు.