అమరావతి ఆత్మగౌరవం గెలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో పార్లమెంటు చట్టబద్ధతతో రాజధానికి నేడు తిరుగులేని శాసనం దక్కిందని పేర్కొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం గ్రామానికి సీఎం సతీసమేతంగా వెళ్లారు. దీపహారతి ఇచ్చి పుణ్యభూమికి సాష్టాంగ ప్రణామం చేశారు. ఈ సందర్భంగా నాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రైతులు చాలా మంది చంద్రబాబును కలిసి నాటి సంగతులను గుర్తు చేశారు. ఉద్యమ శిబిరాల్లో రైతుల కన్నీళ్లు, ఉద్యమ ఘటనలు.. 1,631 రోజుల రైతులు, మహిళల వీరోచిత పోరాటాలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయని చెప్పారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ఎప్పుడు వెళ్లినా… మనసంతా భావోద్వేగంతో నిండిపోతుందన్న చంద్రబాబు రాజధాని, రాష్ట్రాభివృద్ధికి మరింత కృషి చేయాలనే బాధ్యత తనపై ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటానని పునరుద్ఘాటించారు. అమరావతి రైతులు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్న ఆయన అమరావతి చట్టబద్ధతకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా చేసిన సహకారం మరువలేమని తెలిపారు.