హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో ఏషియన్ టెక్స్ టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON)ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ DNA లోనే టెక్స్ టైల్ ఉందని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు. నిజాం కాలంలోనే ప్రపంచ నలుమూలల నుండి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. పోచంపల్లి ఇక్కత్ నుండి గద్వాల్ చీరల వరకు, వరంగల్ దుర్రీస్ నుండి నారాయణపేట చేనేత వరకు తెలంగాణ ప్రత్యేకతను చాటి చెబుతాయన్నారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్ టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ప్రోత్సాహకాలతో పాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదు. విజయవంతమైన, నమ్మకమైన భాగస్వామి. మనందరం కలిసి కొత్త భవితను నిర్మిద్దామని పెట్టుబడిదారులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు విచ్చేసిన వాళ్లు మన అతిథులు మాత్రమే కాదని తెలంగాణ అభివృద్ధిలో, విజన్ లో భాగస్వాములుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.