దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను రూ.252 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా రూ.33 కోట్లతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, 30 బీఏ సెట్ కంప్రెసర్లను అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసింది. అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. సమర్థవంతమైన సేవలతో ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రాణాలను రక్షించడం అదే విధంగా ఆస్తిని రక్షించడమే లక్ష్యంగా అగ్నిమాపక శాఖ పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణలో ఒక కొత్త స్టాండర్డ్ ను నెలకొల్పింది. ఇతర రాష్ట్రాలు సైతం ఇక్కడి పనితీరును, సాంకేతికతను అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా కృషిచేస్తోంది.