మలయాళంతో పాటు తెలుగులోనూ విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న కథానాయకుడు దుల్కర్ సల్మాన్. లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దుల్కర్ నటిస్తున్న పూర్తి స్థాయి తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. కొత్త నటి సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.అగ్ర నటి శృతిహాసన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ‘కృష్ణ’ అనే పాత్రలో కనిపించనున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్తంగా సమర్ధిస్తున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సారం ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కె.ఎల్. ప్రవీణ్ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. శ్వేతా సాబు సిరిల్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్. సున్నితమైన ఎమోషన్స్, మానవ సంబంధాల నేపథ్యంలో హృదయాలను హత్తుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇలాంటి సున్నిత భావోద్వేగభరితమైన కథలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, బలమైన కథాబలంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఉంది. ఈ చిత్రం కూడా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత సన్నిహితుడైన దుల్కర్ సల్మాన్ నటనకు ఇక్కడి ప్రేక్షకులలో కూడా భారీ అభిమానులు ఉన్నారు. అందుకే ట్రేడ్ వర్గాల్లోనూ మంచి చర్చ నడుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది