బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన ఇక జాతీయ రాజకీయాలకే పరిమితమవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు నితీశ్ స్వయంగా తెలిపారు. ఇక ఈ ప్రమాణస్వీకారంతో నితీశ్ కుమార్ ఒక అరుదైన రాజకీయ ఘనతను అందుకున్నారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి, లోక్సభ, రాజ్యసభ ఇలా నాలుగు చట్టసభల్లో సభ్యుడిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఇలా నాలుగు సభలలో ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం ఆయన నిన్నే ఢిల్లీకి చేరుకున్నారు. మార్చి 16న ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మార్చి 30న తన శాసనమండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) రాజీనామా చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆయన సీఎంగా కూడా తప్పుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ బీహార్లో చాలా పనులు చేశాను. ఇక ఇక్కడే ఉండి సేవ చేయాలని భావిస్తున్నానని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. కొత్త సీఎం, మంత్రులు బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. 2005 నవంబర్ లో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి నితీశ్ కుమార్ అసెంబ్లీకి పోటీ చేయకుండా, శాసనమండలి సభ్యుడిగానే కొనసాగుతున్నారు. 2006 నుండి వరుసగా నాలుగుసార్లు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితీశ్, ఆ తర్వాత లోక్సభ ఎంపీగా కూడా పని చేశారు.