‘ధురంధర్ 2’ పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

Spread the love

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజా సంచలనం ‘ధురంధర్’ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ధురంధర్‌ సీక్వెల్ అయిన Dhurandhar 2 చిత్రాన్ని చూసినట్లు తెలిపారు. సినిమా చూసిన తర్వాత తన ఆనందాన్ని, అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తించాయి. సినిమా అద్భుతంగా ఉందని చెప్పిన సందీప్ రెడ్డి వంగా, ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య ధర్  టాలెంట్ ను కొనియాడారు. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పైన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక కామెంట్  సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్  ఆదిత్యధర్‌, హీరో రణ్‌వీర్ సింగ్‌కు తగిలిన దిష్టి అంత తేలికగా పోదు. గుప్పెడంత మిరపకాయలతో దిష్టి తీస్తే సరిపోదు… మొత్తం మిరపతోటనే తగలబెట్టాల్సి ఉంటుంది అంటూ తన ఆప్యాయత  కలిగిన మాటలతో ప్రశంసించారు. ఇటీవల ఈ సినిమా గురించి కొన్ని విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే.  ముఖ్యంగా కొన్ని వర్గాలు ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో రూపొందిందని, కొన్ని రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంలా ఉపయోగపడుతుందని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కూడా సందీప్ రెడ్డి వంగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు. సత్యాన్ని చెప్పడం ప్రచారంగా మారిపోయిన సమయం ఎప్పుడొచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఒక కథలో వాస్తవాలను చూపిస్తే వెంటనే దానిని ప్రచారంగా ముద్ర వేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలోనే చాలా మంది రచయితలు, నటులు ప్రచారంతో తమ కెరీర్‌ను నిర్మించుకుంటున్నారు. కానీ అదే విషయాన్ని ఇప్పుడు ఈ సినిమాపై విమర్శగా చూపించడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “మీరు ఇతరులను ఎగతాళి చేస్తూ విమర్శలు చేస్తుంటే… మీరు ఉదారవాదులమని చెప్పుకోవడం సరైంది కాదు. ఒక కథలో నిజాన్ని చెప్పడం ప్రాపగండా అని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా ఒక్కడే చూడలేదు. ఆయనతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  కూడా ఈ సినిమాను కలిసి చూసాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సందీప్ రెడ్డి వంగా చేసిన ప్రశంసలపై దర్శకుడు ఆదిత్యధర్ కూడా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన సందీప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపిన ప్రేమ, విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. “ప్రియమైన సందీప్… సరైన సమయం వచ్చినప్పుడు మీ అభిప్రాయాన్ని మీ స్టైల్‌లో చెప్పే విధానం నాకు చాలా ఇష్టం” అని ఆయన పేర్కొన్నారు. మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది. నమ్మకం ఉంటుంది. మీరు ఎటువంటి సందేహాలు లేకుండా, హంగామా లేకుండా మీ సినిమాలను తెరకెక్కించే విధానం ఎంతో ప్రేరణనిస్తుంది. అలాంటి నమ్మకం మాలాంటి చాలా మందికి స్ఫూర్తిగా మారిందని ఆయన అన్నారు. ఈ సందర్భంలో ప్రభాస్ గురించి కూడా ఆదిత్యధర్ ప్రస్తావించారు. “ప్రభాస్ సర్‌కు నా ప్రేమను తెలియజేయండి. ఆయనతో మీరు చేస్తున్న స్పిరిట్ సినిమాకు నా శుభాకాంక్షలు. ఆ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *