ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదిక మీద అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయిందని ఇందులో ప్రతి చర్య చట్టబద్దం, రాజ్యాంగబద్దం. లోకసభ, రాజ్యసభ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం తో గెజిట్ విడుదల చేసింది. ఇలా అన్ని పక్షాల ఆమోదంతో తెలంగాణ,`ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటిందని అన్నారు. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయన్న ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదని అన్నారు.
టీడీపీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ నాయకులొకవైపు, జనసేన అధినేత మరోవైపు అక్కడక్కడ మీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవని అన్నారు. రాష్ట్ర విభజన ఏదో అనుచితంగా జరిగినట్టు, అసమంజసంగా తెలంగాణ ఏర్పడ్డట్టు చేస్తున్న అసందర్భపు వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన స్పర్థలు, వైషమ్యాలు, ద్వేషాలు రగిలించేవిగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఏపీలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పెద్దగా చంద్రబాబు చొరవ తీసుకొని భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన నాయకులకు చెప్పాలన్నారు. భారత్ – పాకిస్తాన్ విభజనలా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ ప్రత్యేక భేటీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్మే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై మాట్లాడిన మాటలు లోక్ సభ రికార్డులనుండి తొలగించేలా లోక్‌సభ స్పీకర్‌కు మీరు లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు.