ఐపీఎల్ సీజన్ 19లో వరుస ఓటములతో డీలా పడిన కోల్ కతా రెండో విజయాన్ని నమోదు చేసింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో కోల్ కతా విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం నుండి కొంత పైకి వచ్చింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రింకూ సింగ్ 83 నాటౌట్ (51; 7×4, 5×6) అద్భుత పోరాటంతో కోల్ కతాకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కామెరూన్ గ్రీన్ (34) పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 5 వికెట్లతో రాణించాడు. జార్జ్ లిండే 1 వికెట్ పడగొట్టాడు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో లక్నో కూడా తడబడుతూనే ఆడింది. రిషబ్ పంత్ (41), మార్క్రమ్ (31),ఆయుష్ బడోని (24), హిమ్మత్ సింగ్ (19) పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, వైభవ్ అరోరా 2 వికెట్లు, అనుకుల్ రాయ్, కామెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సిన తరుణంలో షమీ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఇక సూపర్ ఓవర్ లో లక్నో ఘోరంగా ఆడింది. సునీల్ నరైన్ బౌలింగ్ లో మొదటి బంతికే నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రిషబ్ పంత్ 1 పరుగు తీశాడు. ఆ తర్వాత మార్క్రమ్ కూడా భారీ షాట్ ఆడి అవుటవడంతో లక్నో సూపర్ ఓవర్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా సునాయాసంగా ఛేదించి విజయాన్ని అందుకుంది.