సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్షించారు. ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని సూచించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం, జరుగుతూనే ఉండాలని పేర్కొన్నారు. వేసవిలో విద్యుత్ సరఫరా, 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు. వేసవిలో ప్రతి రోజూ 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు వివరించారు. ఈ నెలలో ఇప్పటి వరకు 6397 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించు కున్నట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే సుమారు 14 శాతం మేర విద్యుత్ వినియోగం పెరిగిందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం పెరగడానికి వేసవితో పాటు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగిందని అధికారులు తెలిపారు. రానున్న ఆరు నెలల కాలానికి విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఏప్రిల్ 2025లో విద్యుత్ కొనుగోలు ధర రూ. 5.20 ఉండగా మార్చి 2026 నాటికి రూ. 4.90కు తగ్గించామని అధికారులు తెలిపారు.
విద్యుత్ కొనుగోళ్ల వ్యయం తగ్గించే దిశగా తీసుకునే చర్యలపైనా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్ లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ కు పెద్ద పీట వేయాలన్నారు. దీని కోసం ట్రాన్స్ కో, జెన్కో వంటి సంస్థలు తమకున్న సీఎస్సార్ నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పొల్యూషన్ తగ్గేలా ర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. 2028-29 నాటికి సగాని పైగా విద్యుత్ ఉత్పత్తి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చేలా చూడాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 52396 సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు ఇచ్చాం. దీన్ని మరింత వేగంవంతం చేయాలి. ఇకపై ప్రతి నెల 2 లక్షల పీఎం సూర్య ఘర్ కనెక్షన్లు ఇచ్చేలా చూడాలి. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 2.94 లక్షల కనెక్షన్లు ఇచ్చాం. మొదటి విడత పీఎం కుసుమ్ పథకాన్ని డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. ఇక ఎలక్ట్రిక్ వాహానాల వినియోగం, కొనుగోళ్లపై పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్, ట్రాన్సుకో, జెన్కో, వివిధ డిస్కంలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.