అలనాటి సీనియర్ హీరోయిన్ మంజుల కుటుంబం నుండి మరొకరు సినిమాల్లోకి వస్తున్నారు. మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్ సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న ‘అగధ’ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమవుతున్నారు. ఇక జోవికా ‘అగధ’ చిత్రంలో నటిస్తున్న ‘హరిణి’ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అద్భుతమైన నిర్మాణ విలువలు భారీ సెట్లు, క్వాలిటీ అవుట్ పుట్ తో ‘అగధ’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని మూవీ టీమ్ కాన్ఫిడెంట్ తో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఒకప్పుడు భారీ చిత్రాల నిర్మాతగా ఎం.ఎస్.రాజుకు మంచి పేరున్న సంగతి తెలిసిందే. దేవి, దేవి పుత్రుడు, ఒక్కడు, మనసంతా నువ్వే వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. నిర్మాతగా, దర్శకుడిగా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు చాలా కాలం తరువాత మరోసారి దర్శకుడిగా ‘అగధ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.