నేడు పదవ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది 81.1 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగింది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణతా శాతం 5.22 శాతం ఎక్కువగా ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈ సంవత్సరం 78.39 శాతానికి పెరగడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల ప్రణాళికతో ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రశంసనీయమని ఇందుకు మంత్రి లోకేష్ తో సహా ఆ శాఖ అధికారులను, టీచర్లను, సిబ్బందిని అభినందించారు. పిల్లల్లో నైతిక విలువల పెంపుతో పాటు సమగ్ర విద్యా వికాసానికి విద్యా శాఖ చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.