మరోసారి తన దుష్టబుద్ధిని పాక్ ప్రదర్శిస్తోంది. మన దేశ రాజధాని ఢిల్లీ, హరియాణాల్లో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఆ దేశానికి చెందిన ఐఎస్ఐ కుట్ర పన్నిన ఉదంతం బయటపడింది. తన టార్గెట్ లిస్టులో ఢిల్లీ-సోనిపట్ హైవేపై పాపులర్ దాబా, హరియాణాలోని మిలిటరీ క్యాంప్, ఢిల్లీలోని ఓ ప్రముఖ టెంపుల్ ఉన్నట్లు తెలిసింది. షహజాద్ భట్ మాడ్యూల్ తో సంబంధం ఉన్న ఆపరేటివ్ లతో ఈ ఎటాక్స్ చేసేందుకు ప్రణాళిక వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ గ్యాంగ్ లో 9 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. ఢిల్లీ పోలీసు విభాగంలోని స్పెషల్ సెల్ అధికారులు వీరిని విచారించిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక నిందితుల్లో ఒకరు ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆలయం వద్ద రెక్కీ నిర్వహించారని, అక్కడి ఫొటోలను సోషల్ మీడియా వేదికల ద్వారా పాక్ కు చెందిన హ్యాండ్లర్లకు పంపినట్లు గుర్తించారు. ఆలయం వద్ద మోహరించిన సిబ్బంది టార్గెట్ గా కాల్పులు జరిపి, భయాందోళనలు సృష్టించాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.