అనంతపురం జిల్లా దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన కేంద్రంగా మారబోతోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫైటర్ జెట్స్ ఇక్కడ తయారు కాబోతున్నాయి. ఇది రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేసే కీలక ఘట్టంగా నిలవనుంది. భారీ పెట్టుబడులు మరియు వేలాది ఉద్యోగాల కల సాకారమవబోతోంది. దశాబ్దాలుగా కరువు మరియు వలసల కన్నీటి కథలకు సాక్ష్యంగా నిలిచిన అనంతపురంకు ఇప్పుడు పారిశ్రామిక వెలుగులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా విభజన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాకు ఈ ఏరోస్పేస్ ప్రాజెక్ట్ ఒక గేమ్ ఛేంజర్ గా మారింది. కేవలం స్పిరిచువల్ టూరిజానికి పరిమితమైన పుట్టపర్తి ఇప్పుడు నేషన్ డిఫెన్స్ మ్యాప్ లో ఘనమైన నిలవనుంది. గతంలో నిరుద్యోగంతో బెంగళూరు వైపు ఆశగా చూసే యువతకు ఇప్పుడు సొంత గడ్డపైనే ఉపాధి దక్కే అవకాశం రానుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా వేగంగా రూపాంతరం చెందనుంది. రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ఇదొక కీలక ఘట్టంగా ఉండనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నదే అత్యాధునిక యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (amca) అమ్కా. శత్రువుల రాడార్లకు చిక్కకుండా దాడి చేయడమే ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ యొక్క మెయిన్ స్పెషాలిటీ. ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని అగ్రరాజ్యాల వద్ద మాత్రమే ఇటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మన దేశం ఈ ఎయిర్ క్రాఫ్ట్ లను సొంత పరిజ్ఞానంతోనే డెవెలప్ చేస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తయారీ కేంద్రంగా పుట్టపర్తి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఎగుమతులు కూడా పెరగనున్నాయి. ఈ విమానాల అసెంబ్లీ మరియు టెస్టింగ్ కోసం పుట్టపర్తిలో వరల్డ్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రక్షణ పరిశోధన సంస్థ భారీ విస్తీర్ణంలో భూమిని కోరగా.. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లోని భూములు ఈ భారీ ప్రాజెక్టుకు అత్యంత అనువైనవని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో శరవేగంగా జరుగుతోంది. భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారంతో పాటు ఉపాధి కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది. పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కనెక్టివిటీ మరియు మౌలిక వసతులపై సమగ్ర నివేదిక సిద్ధం చేశారు. ఈ మెగా ప్రాజెక్టులో కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ పారిశ్రామిక దిగ్గజాలు కూడా భాగస్వాములవుతున్నాయి. టాటా మరియు ఎల్ అండ్ టీ వంటి సంస్థలు ఇక్కడ తమ యూనిట్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దేశీయ దిగ్గజ కంపెనీలు విమాన భాగాల తయారీ కోసం ప్రత్యేక విభాగాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాయి. భారీ పెట్టుబడులతో ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థను రాబోయే కాలంలో పూర్తిగా మార్చివేయనుంది. ఈ పెట్టుబడుల వల్ల స్థానికంగా రియల్ ఎస్టేట్ మరియు అనుబంధ వ్యాపార రంగాలు కూడా దూసుకెళ్తాయి. దీంతో ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ పెరగనుంది. పుట్టపర్తి డిఫెన్స్ సెక్టార్ కు వేదిక కావడానికి ఇక్కడి భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశ ఏరోస్పేస్ రాజధానిగా పిలిచే బెంగళూరుకు ఇది అతి సమీప దూరంలో ఉండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి. అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని పూర్తిస్థాయిలో విమానాల ఉత్పత్తి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దశలవారీగా ఈ కేంద్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.