pic:symbolic image
ఆధునిక యుద్ధ రంగం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. వస్తున్న సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. మన రక్షణారంగ పరిశోధనా సంస్థ DRDO కూడా సరికొత్త అస్త్రాలతో దూసుకుపోతోంది. అలా తీసుకొచ్చిందే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ ‘తారా’. సాధారణంగా యుద్ధ విమానాల నుండి వదిలే బాంబుల్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి.. స్మార్ట్ బాంబులు, ఇవి టార్గెట్ వైపు దూసుకెళ్తాయి. రెండు..డమ్ బాంబులు. వీటిని విమానం నుండి వదిలితే, అవి గాలి వాటాన్ని బట్టి కిందకు పడతాయి. వీటిలో ఎలాంటి నావిగేషన్ ఉండదు. అందుకే ఇవి టార్గెట్ కు కొంచెం అటు ఇటుగా పడే అవకాశం ఉంది. దీనివల్ల బాంబు వెస్ట్ అవ్వడమే కాకుండా, శత్రువు తప్పించుకునే అవకాశం ఉంటుంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇలాంటి పాతకాలపు డమ్ బాంబులు లక్షలాదిగా ఉన్నాయి. ఇది కొత్తగా తయారు చేసిన బాంబు ఏమీ కాదు. ఇది ఒక గ్లైడ్ కిట్ .సింపుల్ గా చెప్పాలంటే ఇది విమానాల ద్వారా జారవిడిచే పాతకాలపు అన్-గైడెడ్ , డమ్ బాంబులకు అమర్చే ఒక స్పెషల్ ఎక్విప్మెంట్. మన దగ్గర ఎప్పటినుండో నిల్వ ఉన్న సాధారణ బాంబులకు ఈ తారా కిట్ ను జత చేయడం ద్వారా, అవి క్షణాల్లో ఒక మోడ్రన్ ప్రిసిషన్-గైడెడ్ స్మార్ట్ వెపన్ గా మారతాయి.
ఈ కిట్ లో ఏరోడైనమిక్ వింగ్స్ , ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, ఇస్రో కు చెందిన మన సొంత నావిగేషన్ సిస్టమ్ అయిన NavIC కనెక్టివిటీ ఉంటాయి. ఫైటర్ జెట్ పైనుంచి బాంబును వదలగానే ఈ తారా కిట్ కు ఉన్న వింగ్స్ ఆటోమేటిక్ గా తెరుచుకుని గ్లైడ్ అవుతూ సెట్ చేసిన GPS కోఆర్డినేట్స్ వైపు కచ్చితంగా ప్రయాణించి, ఎంత చిన్న టార్గెట్ నైనా పక్కాగా ఛేదించి సత్తా చాటుతాయి. తారా కిట్ ద్వారా బాంబులు గాలిలో గ్లైడ్ అవుతాయి కాబట్టి, మన ఫైటర్ జెట్లు శత్రువుల గగనతలానికి చాలా దూరంలో సేఫ్ గా ఉంటూనే, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ పైకి ఈ బాంబులను సంధించవచ్చు. దీని వల్ల మన పైలట్లకు , ఖరీదైన ఫైటర్ జెట్లకు పూర్తి రక్షణ దొరుకుతుంది.
రష్యా తన పాత బాంబులను ఇలాగే స్మార్ట్ బాంబులుగా మార్చి ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. అమెరికా దగ్గర కూడా ఇలాంటి కిట్లు ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే రేంజ్ లో తన సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకుంది. మేక్ ఇన్ ఇండియా , ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో DRDO ఈ తారాను అభివృద్ధి చేసింది. దీని వల్ల మన గోడౌన్లలో ఏళ్ల తరబడి పడి ఉన్న లక్షలాది డమ్ బాంబులను చాలా తక్కువ ఖర్చుతో అడ్వాన్స్డ్ స్మార్ట్ వెపన్స్ గా మార్చుకునే వెసులుబాటు దొరికింది. దీనివల్ల విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల స్మార్ట్ బాంబులు కొనాల్సిన ఆవశ్యకత ఉండదు. భారతీయ రక్షణ రంగం స్వయం సమృద్ధితో ముందుకు దూసుకుపోతుండటం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. DRDO రూపొందించిన ఈ తారా గ్లైడ్ కిట్ మన ఎయిర్ ఫోర్స్ కు ఒక గొప్ప గేమ్ ఛేంజర్ గా చెప్పుకోవచ్చు.