కొరటాల-బాలకృష్ణ సినిమా…కార్పెంటర్ గా బాలయ్య?

Spread the love

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ అగ్రహీరోలలో నందమూరి బాలకృష్ణ  ఒకరు. ఆయన నుండి సినిమా వస్తుందంటే మాస్ ప్రేక్షకులకు ఒక ట్రీట్ లాంటిదే. ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఆయన సినిమాల టైటిల్స్ విషయంలో అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి ఇలా పవర్‌ఫుల్ టైటిల్స్‌ తో అదరగొడుతుంటాయి. గతేడాది ‘అఖండ 2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని గతంలో తెరకెక్కించిన వీర సింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేసింది. మరోసారి బాలయ్యతో ఆయన కాంబినేషన్ ఎలా ఉండబోతోందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే సమయంలో బాలయ్య 112వ సినిమాకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నారు. సామాజిక అంశాలను కమర్షియల్ స్టైల్లో చూపించడంలో కొరటాల శివకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి చిత్రాలతో ఆయన తనదైన డైరెక్షన్ తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు అలాంటి దర్శకుడు బాలయ్యలాంటి మాస్ హీరోతో సినిమా చేయబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రాన్ని నిర్మాత మిక్కిలినేని సుధాకర్ తమ యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనిపై  అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం మాత్రం ఈ సినిమా టైటిల్. సాధారణంగా బాలయ్య సినిమాలకు టైటిల్స్ అంటేనే ఓ రేంజ్‌లో ఉంటాయి. టైటిల్ వినగానే హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమైపోతుంది. కానీ ఈసారి కొరటాల శివ పూర్తిగా భిన్నంగా ఆలోచించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి “కార్పెంటర్” అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కార్పెంటర్ అనే పదం వినగానే సాధారణంగా ఒక వడ్రంగి గుర్తుకు వస్తాడు. కానీ ఈ కథలో ఆ పదానికి మరింత లోతైన అర్థం ఉంటుందని తెలుస్తోంది. సమాజంలో అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితులను హీరో తన ఆలోచనలతో, తన నాయకత్వంతో మళ్లీ సరిచేస్తాడట. ఒక శిల్పి చెక్క ముక్కను అందమైన రూపంగా మార్చినట్లే, హీరో కూడా సమాజాన్ని మార్చే నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. అందుకే ఈ చిత్రానికి “కార్పెంటర్” అనే టైటిల్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వస్తే కానీ ఇది నిజమో కాదో తెలిసేది. ఏదేమైనా పాత్ర ఎలాంటిదైనా తనదైన శైలిలో అదరగొట్టడం బాలకృష్ణ ప్రత్యేకత. అందుకే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *