తెల్లవారుజామున.. అంతా గాఢ నిద్రలో ఉన్న వేళ. ఒక్కసారిగా భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఇళ్లు.. భవనాలు కుప్పకూలాయి. క్షణాల్లోనే ఫ్లోరెస్ ద్వీపం యుద్ధభూమిని తలపించింది. 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భారీ భూకంపం ఇప్పటికే 38 మందిని బలితీసుకుంది. మరో 13 మంది గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం ధాటికి జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రుల్లోని రోగులను సైతం హుటాహుటిన బయటకు తరలించారు. ఎటు చూసినా భయంతో పరుగులు తీస్తున్న జనం.. కూలిన భవనాలు.. బీటలు వారిన గోడలే కనిపించాయి. తమ కళ్లముందే ఇల్లు కూలిపోవడంతో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి.అయితే.. భూమి కంపించడం ఒక్కసారితో ఆగిపోలేదు. వరుసలు ప్రజలను మరింత భయపెట్టాయి. ఎప్పుడు మరో ప్రకంపన వస్తుందో తెలియదు.. దెబ్బతిన్న భవనం ఎప్పుడు కూలుతుందో తెలియదు. దీంతో ఇళ్లలోకి వెళ్లేందుకు కూడా జనం జంకుతున్నారు. మరోవైపు శిథిలాల మధ్య చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు ప్రాణాలను పణంగా పెట్టి గాలిస్తున్నాయి.ఇంతలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. భూకంప కేంద్రం సముద్రానికి సమీపంలో ఉండటంతో సునామీ హెచ్చరిక జారీ అయింది. దీంతో తీర ప్రాంతాల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది. పిల్లలను ఎత్తుకుని.. వాహనాలపై.. అందిన మార్గంలో అందినట్టుగా ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. కొందరు ప్రాణభయంతో ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మౌమేరె పోర్టులో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఫెర్రీ కోసం వేచి ఉన్న ప్రయాణికులపై టెర్మినల్ భవనం నుంచి భారీ సిమెంట్ శిథిలాలు ఊడిపడ్డాయి. గ్యాంగ్ వే దెబ్బతినడంతో కొందరు ప్రయాణికులు సముద్రంలో పడిపోయారు. ఒక్క క్షణం ఆలస్యమైతే.. ప్రాణాలు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి. భూకంపం సృష్టించిన బీభత్సానికి ఈ దృశ్యాలే అద్దం పడుతున్నాయి.సునామీ హెచ్చరికతో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు.. దాదాపు మూడు గంటల తర్వాత దానిని ఉపసంహరించారు. పెద్ద సునామీ ముప్పు తప్పడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ భూకంపం మిగిల్చిన గాయాలు మాత్రం అలాగే ఉన్నాయి. కూలిన ఇళ్లు.. దెబ్బతిన్న రోడ్లు.. విద్యుత్ అంతరాయం.. కమ్యూనికేషన్ సమస్యలు.. సహాయక చర్యలకు సవాళ్లుగా మారాయి. ఇక నాగేకేయో ప్రాంతంలో సుమారు 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మారుమూల ప్రాంతాలు కావడంతో సహాయక బృందాలు చేరుకోవడం కూడా కష్టంగా మారింది. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి. అయినా.. శిథిలాల కింద ఒక్క ప్రాణం ఉన్నా కాపాడాలన్న లక్ష్యంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తమ వాళ్లు బతికే ఉన్నారన్న ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇండోనేషియాకు భూకంపాలు కొత్త కాదు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉన్న ఈ దేశం.. ప్రకృతి ప్రకోపానికి అత్యంత సున్నితమైన ప్రాంతం. గతంలో 2004 సునామీ.. 2018లో పాలూ విషాదం.. ఇలా ఎన్నో విపత్తులు ఇండోనేషియాను కుదిపేశాయి. ఇప్పుడు ఫ్లోరెస్‌లో మరోసారి అదే భయం.. అదే పరుగులు.. అదే కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం ముగిసిందని భావించే సమయంలోనే ఆఫ్టర్‌షాక్‌లు మరింత ముప్పు తెచ్చే అవకాశం ఉంది. అందుకే రెస్క్యూ బృందాలు ఒకవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే.. మరోవైపు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ప్రతి నిమిషం కీలకమే. శిథిలాల కింద ఉన్నవారికి ప్రతి క్షణం ప్రాణ పోరాటమే. బయట ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రతి శబ్దం ఒక ఆశ. రెస్క్యూ సిబ్బందికి ప్రతి శిథిలం వెనుక ఒక ప్రాణం కనిపిస్తోంది. అందుకే చీకటి పడినా.. సహాయక చర్యలు మాత్రం ఆగడం లేదు. ప్రకృతి విపత్తులను ఆపలేం కానీ హెచ్చరికను ముందుగానే అందించొచ్చు. ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను సకాలంలో తరలించొచ్చు. ప్రాణ నష్టాన్ని తగ్గించొచ్చు. అందుకే విపత్తు సమయంలో అసలైన రక్షణ కవచం.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థే. ఇండోనేషియా విషాదం చెప్పే గుణపాఠం ఒక్కటే. విపత్తు ఎప్పుడు వస్తుందో తెలియకపోవచ్చు.. కానీ హెచ్చరిక వచ్చిన క్షణంలో ప్రజలను కాపాడే వ్యవస్థ మాత్రం సిద్ధంగా ఉండాలి.