ఇప్పటి వరకు ఒక్క అపజయం కూడా లేకుండా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయన సినిమాలు అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఏర్పడింది. అటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పరంగా ఇటు ప్రొడ్యూసర్స్ కు డబ్బు పరంగా అనిల్ రావిపూడి ఆ నమ్మకాన్ని సుస్థిరం చేసుకునీ ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్లో ఒక దర్శకుడు, ఒక సంగీత దర్శకుడి కాంబినేషన్ హిట్ అయితే ఆ జోడీని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడం సాధారణంగా చూస్తుంటాం. ఎందుకంటే హిట్ కాంబినేషన్ అంటే నిర్మాతలకు భరోసా, ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. కానీ ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం కొత్త దారి వెతుకున్నారు. ఆయన సినిమాలు చూసినా, ఆయన ఎంచుకునే టెక్నీషియన్లు చూసినా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.. ప్రతి సినిమాకూ కొత్త ఫీల్ ఇవ్వాలని ఆయన బలంగా నమ్ముతారు. అదే కారణంగా ప్రతి చిత్రానికి కొత్త సంగీత దర్శకుడిని తీసుకుంటూ, తన సినిమాల్లో సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.కెరీర్ ప్రారంభ దశలో అనిల్ రావిపూడి తన సినిమాలకు సాయి కార్తీక్ వంటి సంగీత దర్శకులతో పని చేశారు. ఆ తర్వాత కమర్షియల్ రేంజ్ పెరిగే కొద్దీ దేవీశ్రీప్రసాద్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో చేశారు. ఇక భగవంత్ కేసరి కోసం S. థమన్ ను ఎంపిక చేయగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’, అలాగే ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా లకి భీమ్స్ సిసిరోలియోతో కలిసి పనిచేశారు. ఇప్పుడు అదే ఆలోచనతో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న భారీ మల్టీస్టారర్ కోసం అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జీ.వీ.ప్రకాశ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక జి.వి. ప్రకాష్‌కు తెలుగులో ఇది చాలా కీలకమైన సినిమా కావచ్చు. ఆయన ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలకు సంగీతం అందించినప్పటికీ, భారీ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ మాత్రం ఇంకా దక్కలేదు. అందుకే అనిల్ రావిపూడి లాంటి మినిమమ్ గ్యారెంటీ దర్శకుడితో పనిచేయడం ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ సినిమా తెరకెక్కుతుండటంతో, మ్యూజిక్ ఆల్బమ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. వెంకటేష్ – కల్యాణ్ రామ్ మల్టీస్టారర్, అనిల్ రావిపూడి దర్శకత్వం, జి.వి. ప్రకాష్ సంగీతం అనే కాంబినేషన్ నిజమైతే, అది ఖచ్చితంగా టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా మాస్ ఎంటర్టైన్మెంట్కు క్లాస్ మ్యూజిక్ జతకలిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.