ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అన్నీ సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితి చూస్తే గత రెండు నెలలుగా పెద్దగా భారీ విజయాలు కనిపించలేదు. పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లు కూడా వెలవెలబోతున్నాయి. అలాంటి సమయంలో పెద్ది సినిమా బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపిరి పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏబీసీ సెంటర్లన్నింటిలోనూ పెద్దికి మంచి డిమాండ్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మల్టీప్లెక్స్‌ల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సినిమాపై మంచి ఆసక్తి కనిపిస్తోందట. ఇక పెద్ది ప్రమోషన్స్‌ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ముందుగా ముంబైలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. దేశవ్యాప్తంగా సినిమాలకు ముంబై కేంద్ర బిందువన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత భోపాల్‌లో ప్రత్యేక సాంగ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్స్ పూర్తయ్యాక తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అభిమానులతో ప్రత్యేక సమావేశాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, థియేటర్ విజిట్స్ వంటి కార్యక్రమాలు కూడా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పెద్ది సినిమా ఇప్పుడు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు… మెగా అభిమానులకు ఇది ఒక పెద్ద ఎమోషన్‌లా మారిపోయింది. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు దర్శకత్వం, గ్రామీణ ఎమోషన్స్, భారీ మాస్ ఎలిమెంట్స్… ఇవన్నీ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక జూన్ 4న థియేటర్లలో పెద్ది ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.