దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు బంద్ ను పాటిస్తున్నాయి. మెడికల్ వ్యాపార సంఘాల పిలుపు మేరకుదేశవ్యాప్తంగా మెడికల్ షాప్ ల బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. ఈ బంద్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు సహా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నేడు 24 గంటల పాటు ఫార్మసీలు తెరిచి ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ఎమర్జెన్సీ మెడిసిన్స్ లభించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర ఔషధ నియత్రణ మండలి (డీసీఏ) డీజీ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో, మెడ్ ప్లస్ లాంటి కార్పొరేట్ మెడికల్ స్టోర్ నిర్వాహకులు దుకాణాలను తెరిచి ఉంచాలని కోరారు. ఆన్ లైన్ ఫార్మసీ విక్రయాలను వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. నిత్యం మందులు వాడే దీర్ఘకాలిక రోగులకు ముఖ్యంగా డయాబెటిస్, (బీపీ), గుండె జబ్బులు మరియు కిడ్నీ సమస్యలతో బాధపడేవారిపై ఈ బంద్ ప్రభావం తీవ్రంగా పడుతుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ సకాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, నొప్పులు లేదా అలెర్జీలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు కూడా ఇటువంటి సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోగులు మందుల కోసం వేరే ప్రాంతాలకు ప్రయాణించాల్సి రావడం వల్ల అటు ఆర్థికంగా, ఇటు శారీరకంగా ఇబ్బందులు పడతారు. మొత్తంగా మెడికల్ దుకాణాల మూసివేత అనేది ప్రజారోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.