సమ్మర్ సీజన్ అటు క్రీడలకైనా, ఇటు సినిమాలకైనా సూపర్ సీజన్… ఇక ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటె మరింత సందడి వాతావరణం కనిపించేది. ఇక్కడ తెలుగు సినిమాలు లేకపోయినా తమిళ్ లో కరుప్పు, మలయాళం లో దృశ్యం 3 సినిమాలు రిలీజ్ అయ్యి, ఒక మోస్తరుగా కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి.సినిమా విడుదలైన మొదటి రోజు వచ్చే టాక్, సోషల్ మీడియాలో జరిగే చర్చలు, రివ్యూలు ఇవన్నీ ఒక సినిమాకు ఎంతటి ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ నెగెటివ్ టాక్‌ను దాటుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి సినిమాల జాబితాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం 3’, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చేరాయి. ఈ రెండు సినిమాలకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఆశ్చర్యపరిచే రీతిలో దూసుకెళ్తున్నాయి. దీనికి సమ్మర్ హాలిడేస్ కూడా ఒక పెద్ద కారణం! మొదటగా ‘దృశ్యం 3’ విషయానికి వస్తే… మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన ఈ చిత్రం గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా ఆ సినిమాల్లో వచ్చిన ట్విస్టులు, సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే మూడో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మాత్రం మిశ్రమంగా మారింది. మొదటి రెండు భాగాల మాదిరిగా ఈ సినిమాలో అంతటి బలమైన ట్విస్టులు లేవని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కథ నెమ్మదిగా సాగిందని, కొన్ని సన్నివేశాలు మరింత బలంగా ఉండాల్సిందని విమర్శకులు పేర్కొన్నారు. అయితే చివరి ఇరవై నిమిషాలు మాత్రం మళ్లీ పాత ‘దృశ్యం’ మ్యాజిక్‌ను గుర్తు చేశాయని ప్రశంసించారు.టాక్ ఎలా ఉన్నప్పటికీ… బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘దృశ్యం 3’ అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. మొదటి వారాంతానికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా 1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం విశేషం. మలయాళ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ఎంతగా పెరిగిందో ఈ కలెక్షన్లు మరోసారి నిరూపించాయి.
ఈ సినిమాను ఆంటోని పెరుంబవూర్ నిర్మించగా… జీతు జోసఫ్ దర్శకత్వం వహించారు. మోహన్‌లాల్-జీతు జోసఫ్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ఇంకా అదే స్థాయి క్రేజ్ ఉందని ‘దృశ్యం 3’ వసూళ్లు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ విషయానికి వస్తే… ఈ సినిమా కూడా విడుదలకు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. గత కొంతకాలంగా సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతున్నాయి. దీంతో అభిమానులంతా ‘కరుప్పు’పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘ఆర్జే బాలాజీ’ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ కోర్ట్ డ్రామా మొదటినుంచే ఆసక్తిని పెంచింది. సినిమా చూసిన అభిమానులు సూర్య నటన, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, కోర్ట్ డ్రామా ఎలిమెంట్స్‌ను బాగా ఎంజాయ్ చేశారు. కొంతమంది అయితే సినిమా చాలా స్లోగా సాగిందని కామెంట్స్ చేశారు. అయినా కూడా ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రూ. 200 కోట్ల మార్క్‌ను కూడా దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాను ‘వీరభద్రుడు’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి స్పందన రావడం విశేషం. ముఖ్యంగా సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకాదరణ బాగానే ఉంది. అలాగే త్రిష కీలక పాత్రలో కనిపించడంతో ఆమె అభిమానులు కూడా థియేటర్లకు వస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం మోహన్‌లాల్ ‘దృశ్యం 3’, సూర్య ‘కరుప్పు’ సినిమాలు ఒక విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. సోషల్ మీడియా టాక్, రివ్యూలు ఎలా ఉన్నప్పటికీ స్టార్ హీరోలపై ప్రేక్షకుల నమ్మకం ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్స్, స్టార్ పవర్, బ్రాండ్ వాల్యూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోగలవని ఈ రెండు సినిమాలు మరోసారి చూపించాయి.