కాంగ్రెస్ ట్రబుల్ షూటర్… ఇక కర్ణాటక సీఎం

Spread the love

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఊహించని మలుపుతో దక్షిణాది రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటక సీఎం(KARNATAKA CM)గా సిద్ధరామయ్య దిగిపోయారు… కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన డీకే శివకుమార్ సరికొత్త బాధ్యతలు అందుకోబోతున్నారు. ఇప్పటివరకు సీఎంగా కొనసాగిన సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఒక బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో మంత్రుల సమక్షంలో ఈ సంచలన ప్రకటన వెలువడింది. దీంతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఒక్కలింగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. కనకపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు సోనియా, ప్రియాంక గాంధీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

ఆర్థికంగా బలమైన నేత

రాజకీయాల్లోనే కాకుండా ఆస్తుల పరంగా కూడా డీకే శివకుమార్ రేంజ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేలలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. 2023  అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ రూ.1413 కోట్ల రూపాయలుగా ఉంది. డీకే శివకుమార్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయనో విజయవంతమైన వ్యాపారవేత్త. అయితే ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆయనపై పంతొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో తెలిపారు. కేసుల సవాళ్లు ఎదుర్కొంటూనే ఆయన తన ఆర్థిక సామ్రాజ్యాన్ని, రాజకీయ బలాన్ని సమాంతరంగా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతుండటంతో ఆయన ఆస్తులు, వ్యాపారాల గురించిన చర్చలు దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి.

అప్పుడే సీఎం అవుతారనుకున్నారు 

2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే శివకుమార్ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అనుభవజ్ఞుడైన ఓబీసీ నేత సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా పావులు కదిపి సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. అప్పట్లో ఇద్దరు నేతల మధ్య చెరి సగం కాలం ముఖ్యమంత్రిగా ఉండేలా అనధికారిక ఒప్పందం కుదిరిందని ప్రచారం సాగింది. అయితే తన పదవీకాలం ముగిసినా సిద్ధరామయ్య సీటు వదలకుండా కొనసాగేందుకు ప్రయత్నించారు. దీనితో డీకే శివకుమార్ హైకమాండ్ స్థాయిలో గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చారు. ఢిల్లీ వేదికగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో డీకే జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పార్టీని గెలిపించిన నేతగా సీఎం పదవి పొందేందుకు తనకు పూర్తి అర్హతలు ఉన్నాయని ఆయన నిరూపించుకున్నారు. చివరికి హైకమాండ్ ఆదేశాలను గౌరవిస్తూ సిద్ధరామయ్య తన పదవిని త్యాగం చేయక తప్పలేదు. ఈ విధంగా తెరవెనుక నడిచిన సుదీర్ఘ రాజకీయ పోరాటానికి తెరపడుతూ డీకేకి లైన్ క్లియర్ అయింది.

కాంగ్రెస్ వ్యూహం…కొత్త సీఎంతో వచ్చే ఎన్నికలకు 

కర్ణాటకలో రాబోయే 2028  అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ హైకమాండ్ కొత్త వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. కొత్త ముఖంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ అధిష్ఠానం గట్టిగా నిర్ణయించుకుంది. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ఒక్కలింగ సామాజిక వర్గానికి డీకే శివకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ వర్గానికి చెందిన నేత సీఎం అయితే ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 

ఇక సిద్ధరామయ్య రాజీనామా బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఆలింగనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  ఈ అధికార బదిలీ ప్రక్రియ చాలా సున్నితంగా సాగుతోంది. తనకు కేంద్ర పదవులు గానీ, రాజ్యసభ సీటు గానీ వద్దని, రాజకీయాల్లోనే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో మంత్రుల వర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. 

ఇదీ కర్ణాటక కొత్త బాస్ డీకే శివకుమార్ పవర్, ఆయన వెనకున్న భారీ ఆర్థిక సామ్రాజ్యం. సిద్ధరామయ్య సున్నితంగానే తప్పుకున్నా… డీకే శివకుమార్ ముందు బలమైన సవాళ్లు కూడా ఉన్నాయనే చెప్పాలి. మరి డీకే శివకుమార్ నాయకత్వంలో కర్ణాటక అభివృద్ధి పథంలో దూసుకుపోతుందా? కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం, అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయడం ఆయనకు ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. మరి ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న డీకే… సీఎం గా ఎలాంటి మార్పులు తీసుకువస్తారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *