ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ (Jeff Bezos) కు చెందిన ‘బ్లూ ఆరిజన్’ కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ సంస్థ పరీక్షించిన ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ పైనే పేలిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశమైంది. ఈ పేలుడు ధాటికి భారీ స్థాయిలో ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్లో అక్కడి సమయం ప్రకారం గురువారం బ్లూ ఆరిజిన్ సంస్థ ‘న్యూ గ్లెన్’ రాకెట్ కు సంబంధించి హాట్ పైర్ టెస్ట్ చేసింది. ఆ సమయంలో ఉన్నట్టుండి రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంస్థ తెలిపింది. పేలుడుకు సంబంధించి సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై జెఫ్ బెజోస్ స్పందించారు. మా సిబ్బంది అంతా సురక్షితంగా, క్షేమంగా ఉన్నారు. అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి ఇంకా సమయం పడుతుంది, కానీ మేము ఇప్పటికే ఆ పనిలోనే ఉన్నాము. ఈ రోజు మాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది (చాలా కష్టమైన రోజు), కానీ దెబ్బతిన్న ప్రతిదాన్ని మేము మళ్లీ నిర్మించి, మరింత బలంగా తిరిగి వస్తాం. దీని కోసం శ్రమిస్తున్నామని తెలిపారు.
స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ సెక్టార్ లో దూసుకుపోతున్న ‘బ్లూ ఆరిజన్’
ఇక స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ సెక్టార్ లో ‘బ్లూ ఆరిజన్’ ప్రస్తుతం దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. రాకెట్ల పునర్వినియోగం (Reusability) వంటి అంశాల్లో ఈ సంస్థ ఇప్పటికే తన సత్తా చాటింది. ఆ సంస్థ తయారు చేసిన ‘న్యూ షెపర్డ్’ రాకెట్,స్పేస్ లోకి వెళ్లి విజయవంతంగా తిరిగి భూమిపై వర్టికల్ గా ల్యాండ్ అయి రికార్డు సృష్టించింది. ఒకే రాకెట్‌ను తిరిగి వినియోగించడంతో స్పేస్ మిషన్ల వ్యయాన్ని భారీగా తగ్గించవచ్చని బ్లూ ఆరిజన్ నిరూపించింది.
బ్లూ ఆరిజన్ సాధారణ ప్రజలను, సెలబ్రిటీలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే స్పేస్ టూరిజం రంగంలో హిస్టారిక్ మైల్ స్టోన్స్ సాధించింది. 2021లో స్వయంగా జెఫ్ బెజోస్ తన టీమ్ తో కలిసి ‘న్యూ షెపర్డ్’ క్యాప్సూల్ ద్వారా ప్రయాణించారు. ఆ తర్వాత హాలీవుడ్ నటుడు విలియం షాట్నర్, భారతీయ పారిశ్రామికవేత్త గోపీచంద్ తోటకూర వంటి ఎంతోమందిని అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లి, జీరో గ్రావిటీ ఎక్స్పీరియెన్స్ ను అందించి విజయవంతంగా భూమికి చేర్చింది. అదే కాకుండా అంతరిక్ష ప్రయోగాల కోసం బ్లూ ఆరిజన్ సొంతంగా అత్యంత శక్తివంతమైన ద్రవ ఇంధన ఇంజిన్లను అభివృద్ధి చేసింది. భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనల్లో బ్లూ ఆరిజన్ కీలక భాగస్వామిగా ఎదుగుతోంది.