మన సంస్కృతిలో నదులను కేవలం నీటి వనరులుగా మాత్రమే కాకుండా పవిత్రంగా పూజిస్తాము. పుష్కరాలు వంటి పవిత్ర కార్యక్రమాలు నదీ తీరాలలో నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్న మన సాంప్రదాయం. కోట్లాది మంది ప్రజలు ఈ సమయంలో నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మన విశ్వాసాలను కాపాడుకుంటూనే, నదుల స్వచ్ఛతను కూడా కలుషితం కాకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత. దీనిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే గోదావరి (GODAVARI RIVER) పుష్కరాలు రానున్న నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సమాయత్తమవుతోంది. ఇందుకోసం డిప్యూటీ సీఎం పవన్ (PAWAN KALYAN) కీలక చర్యలకు ఉపక్రమించారు.
తాజాగా కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట కార్యాచరణ ప్రణాళికను (ACTION PLAN) ప్రకటించారు. పుష్కరాల నిర్వహణ నిమిత్తం ఆరు జిల్లాల పరిధిలో గుర్తించిన 262 పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దడంతోపాటు గోదావరి నదిలో కాలుష్య కారక వ్యర్థాల విడుదలను ఆపేందుకు నిరంతర పర్యవేక్షణా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు నిర్వహణతోపాటు పారిశ్రామిక కాలుష్య పర్యవేక్షణకు ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యవేక్షణ బాధ్యతను ప్రధాన నదుల కాలుష్య నివారణకు ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కి అప్పగించనున్నట్టు స్పష్టం చేశారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల పరిధిలో పుష్కరాల నిర్వహణ నిమిత్తం 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. డిప్యూటీ సీఎం అధికారులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శుల సమన్వయ సమావేశం నిర్వహించి 262 పంచాయతీలను పుష్కరాల నాటికి మురుగు విడుదల రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రతి రోజూ గోదావరిలో గ్రామీణ ప్రాంతాల మురుగు 8.38 మిలియన్ లీటర్లు కలుస్తున్నట్లు గుర్తించారు. ఈ మురుగు నిర్వహణకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు.
గృహ వినియోగ మురుగు నీటి నియంత్రణ, నిర్వహణ కోసం వీబీ జీ రాం జీ పథకం కింద మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. బ్లాక్ వాటర్ నిర్వహణ కోసం సామాజిక ఇంకుడు గుంతల తరహా నిర్మాణాలు, ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ ట్విన్ పిట్స్ చేపట్టాలని తెలిపారు. కాలువలు, డ్రెయిన్ల ద్వారా మురుగు నేరుగా గోదావరి నదిలోకి విడుదల కాకుండా పంచాయతీ సిబ్బందితో నిరంతర పర్యవేక్షణా బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గోదావరి నదిలో కలుపుతున్న ఆక్వా కాలుష్యం (aquatic pollution) ప్రమాదకర స్థితికి చేరినట్టు పీసీబీ అధికారుల పరిశీలనలో తేలింది. ఆరు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల నుంచి సుమారు రోజుకి 104 మిలియన్ లీటర్ల మురుగునీరు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి రోజు మరో 8.38 మిలియన్ లీటర్ల మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు కూడా పెద్ద ఎత్తున నదిలో కలిపేస్తున్నారు. అందులో ఒక్క ఆంధ్రపేపర్ మిల్స్ నుంచే రోజుకి 32 మిలియన్ లీటర్ల వరకు వేస్టేజ్ విడుదల అవుతోంది. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి నిత్యం విడుదల అవుతున్న 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం కూడా ఉంటోంది. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా గోదావరి జలాలను కలుషితం చేస్తున్న మురుగు, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాల రూపంలో వెదజల్లే కాలుష్య నివారణకు అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.