రిషబ్ సంచలన నిర్ణయం…లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీకి గుడ్ బై

Spread the love

అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనే జట్లలో ఒకటైన లక్నో సూపర్ జయంట్స్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. లక్నో సూపర్ జయంట్స్ (LSG) ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు  రిషబ్ పంత్ కోరారని, ఆయన అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించిందని అధికారికంగా తెలిపింది. రిషబ్ ఈ అభ్యర్థనతో ఫ్రాంచైజీని సంప్రదించారు, మేము దానిని గౌరవపూర్వకంగా అంగీకరించాము. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ సులభం కాదు. కెప్టెన్‌గా రిషబ్ ఈ డ్రెస్సింగ్ రూమ్‌కు అందించిన ప్రతిదానికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా దృష్టి ఇప్పుడు జట్టు ప్రయోజనాలపైనే ఉందని పేర్కొంది. ఇక అత్యుత్తమ ప్రమాణాలను అందుకోవడానికి జట్టును తిరిగి నిర్మించడం మరియు పునర్వ్యవస్థీకరించడంపైనే తాము  దృష్టి పెడుతున్నట్లు తెలిపింది. 

ఈ ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జయంట్స్ (LSG) ప్రదర్శన అంత ఆశాజనకంగా సాగలేదు. మంచి అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ, జట్టు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో టోర్నీ నుండి నిష్క్రమించింది. ఆ జట్టు 14 లీగ్ మ్యాచ్ లలో కేవలం 4 విజయాలు సాధించి 10 పరాజయాలతో పేలవప్రదర్శన కనబరిచింది.  జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ పంత్ రికార్డు కూడా ఈ సీజన్‌లో అంత గొప్పగా ఏమీ లేదు. అటు కెప్టెన్ గా స్ట్రాటజీలు  ఫలించకపోవడం, ఇటు బ్యాటర్‌గా తన మార్కు డాషింగ్ ప్రదర్శన లేకపోవడం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే పంత్  ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తోంది. ఇక రిషబ్ పంత్ లాంటి స్టార్ ఆటగాడు కెప్టెన్సీకి దూరం కావడం తన అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2026 ఐపీఎల్ సీజన్‌లో, రిషబ్ పంత్ లక్నో సూపర్ జయంట్స్ తరఫున 14 ఇన్నింగ్స్‌ల్లో (14 మ్యాచ్‌ల్లో) 24.00 యావరేజ్ మరియు 138.05 స్ట్రైక్ రేట్‌తో 312 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఆయన ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. 68 పరుగులతో నాటౌట్ గా నిలవడం  అత్యధిక స్కోరుగా నమోదైంది. అలాగే ఈ సీజన్ లో  11 సిక్సర్లు బాదాడు. 2025 ఐపీఎల్ వేలంలో పంత్ ను  లక్నో ప్రాంఛైజీ ఏకంగా రూ.27 కోట్లతో తీసుకున్న  సంగతి తెలిసిందే. అప్పటి నుండి  ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *