అమెరికా అత్యాధునిక యుద్ధనౌక ఎందుకు ఈస్థాయిలో వార్తల్లో నిలిచింది?

Spread the love

అమెరికా రక్షణ శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విమాన వాహక నౌక ఇప్పుడు వివాదాస్పదంగా వార్తల్లో నిలిచింది.  సాధారణంగా నేవీ నిబంధనల ప్రకారం ఏ యుద్ధనౌక అయినా ఏడు నెలలకు మించి సముద్రంలో ఉండకూడదు. ఎందుకంటే అంతకు మించి నీళ్లలో ఉంటే మనుషుల మానసిక, శారీరక స్థితి దెబ్బతింటుంది. కానీ, అంతర్జాతీయంగా చెలరేగుతున్న యుద్ధాలు, ఉద్రిక్తతల నెపంతో నావికులకు ఇంటిబాట లేకుండా చేస్తున్నారు అమెరికా అదికారులు.వాస్తవానికి వియత్నాం యుద్ధం తర్వాత అత్యధిక కాలం సముద్రంలోనే గడిపిన నౌకగా ఇటీవలే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫ్రాంక్ నిలిచింది. ఆ నౌకను ఏకంగా 326 రోజుల పాటు సముద్రంలోనే ఉంచారు. ఇప్పుడు ఈ అబ్రహాం లింకన్ నౌక కూడా ఆ రికార్డును దాటేసేలా కనిపిస్తోంది. సరే, సముద్రంలో ఉన్నా లోపల ఏమైనా ఫైవ్ స్టార్ రేంజ్ సదుపాయాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు. నౌకలో పరిస్థితి ఏమీ బాగోలేదని అక్కడ పనిచేస్తున్న జవాన్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నౌకలో ప్రాథమిక సదుపాయాలు ఘోరంగా తయారయ్యాయని వార్తలు వస్తున్నాయి. కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ఉదయాన్నే కెప్టెన్ మైక్‌లో మాట్లాడేటప్పుడు ఈ రోజు అయినా ఇంటికి వెళ్లే వార్త చెప్తారా అని సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ ఆశ నిరాశగానే మిగిలిపోతోంది.

శారీరక కష్టాల కంటే మానసిక నరకం మనిషిని ఎక్కువగా కుంగదీస్తుంది. నెలల తరబడి కుటుంబాలకు, భార్యాపిల్లలకు దూరంగా ఉండటం, దానికి తోడు చుట్టూ యుద్ధ వాతావరణం కావడంతో సైనికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. నౌకలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువవుతున్నాయని, కొందరు జవాన్లు ఏకంగా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పైకి ఎక్కి నడిసముద్రంలోకి దూకేందుకు యత్నించారని సమాచారం బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అదికారులు ఇద్దరిని సకాలంలో కాపాడారు. ఓ జవాను భార్య కన్నీటిపర్యంతమవుతూ చెప్పిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. నా భర్త చాలా శాంతపరుడు.. కానీ ఇప్పుడు ఫోన్ చేసినప్పుడల్లా తీవ్రమైన కోపంతో, మానసిక అలసటతో మాట్లాడుతున్నాడు అని ఆవిడ వాపోయింది. యుద్ధాల పేరుతో అమెరికా ప్రభుత్వం నావికుల జీవితాలతో ఆడుకుంటోందని జవాన్ల కుటుంబాలు మండిపడుతున్నాయి. అమెరికా నావికాదళం యుద్ధాలకు నాయకత్వం వహించడంలో లీడర్ కావచ్చు.. కానీ నిర్వహణలో మాత్రం పూర్తిగా జీరో అని ఈ ఘటన నిరూపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *