జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ఇప్పటి నుంచే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒకే ఒక్క ప్రీ-లుక్ పోస్టర్‌తో సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అభిమానులు మాత్రమే కాదు, సినీ వర్గాలు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ విడుదలైన వెంటనే కథ నేపథ్యం గురించి అనేక ప్రచారాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కుమారస్వామి అంశాలతో ఈ సినిమా రూపొందనుందనే వార్తలు రావడంతో ఒక్కసారిగా దక్షిణాది సినీ పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై చర్చ మొదలైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కాన్సెప్ట్ గురించి వార్తలు బయటకు వచ్చిన వెంటనే తమిళ సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి కథలపై ప్రకటనలు రావడం. ముఖ్యంగా ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్‌లో కూడా ఇదే తరహా నేపథ్యంతో సినిమా తెరకెక్కనుందనే వార్తలు రావడంతో అందరి దృష్టి ఈ అంశంపైనే నిలిచింది. ఒక మంచి కాన్సెప్ట్ చుట్టూ రెండు పరిశ్రమల్లో ఒకేసారి చర్చ జరగడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పూర్తి దృష్టిని ఆదర్శ కుటుంబం సినిమాపైనే పెట్టారు. ఆ సినిమా విడుదలైన తర్వాత వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచనల మేరకు కొంతకాలం షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన మళ్లీ షూటింగ్‌లలో పాల్గొననున్నారు. ముందుగా డ్రాగన్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. పాత్రకు తగ్గట్టుగా శరీరాకృతి, హెయిర్ స్టైల్, గడ్డం ఇలా ప్రతిదీ మార్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యాక ఆయన కొంత సమయం తీసుకుని కొత్త మేకోవర్‌తో త్రివిక్రమ్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారని చెబుతున్నారు.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే చాలా కాలంగా ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే టైటిల్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. అయితే తాజాగా మరో కొత్త పేరు కూడా తెరపైకి వచ్చింది. అదే ‘దేవసేనాపతి’. ఈ రెండు టైటిల్స్‌పై సోషల్ మీడియాలో కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కొందరు అభిమానులు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమాకు ఇంగ్లీష్ టైటిల్ అయితే మరింత బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు అన్ని భాషల ప్రేక్షకులకు సులభంగా గుర్తుండిపోతుందని వారు చెబుతున్నారు.మరోవైపు మరికొందరు మాత్రం తెలుగు టైటిల్‌కే మద్దతు ఇస్తున్నారు. కథకు తగ్గట్టుగా ‘దేవసేనాపతి’ అనే పేరు మరింత బలంగా ఉంటుందని అంటున్నారు. బాహుబలి వంటి సినిమాలు ప్రాంతీయ భాష టైటిల్‌తోనే ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని అందుకున్నాయని గుర్తు చేస్తున్నారు. టైటిల్ కంటే సినిమాలోని కథ, భావోద్వేగాలు, విజువల్స్ బలంగా ఉంటే ఏ భాష ప్రేక్షకులైనా ఆదరిస్తారని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చిత్రబృందం కూడా తొందరపడకుండా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే అధికారికంగా టైటిల్ ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన సినిమాలు ప్రధానంగా తెలుగు మార్కెట్‌లోనే భారీ విజయాలు సాధించాయి. కానీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదలయ్యే సినిమా మాత్రం ఇదే కావడం విశేషం. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడకుండా ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.