భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల బాట పట్టాయి. దేశీయ సూచీలు నేడు గణనీయంగా పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ ఈరోజు ట్రేడింగ్ లో 325.78 పాయింట్లు నష్టపోయి 76,909వద్ద ట్రేడింగ్ ముగించింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 76.60 పాయింట్లు కోల్పోయి 24,078వద్ద ముగిసింది. నిఫ్టీ 50 వరుసగా ఏడో సెషన్‌కు పతనాన్ని కొనసాగించింది. గత ఏడాది కాలంలో ఇది నిఫ్టీకి అతిపెద్ద వరుస నష్టాల పరంపరగా నిలిచింది. ఈ ఏడు సెషన్లలో నిఫ్టీ సుమారు 2.1% మేర పడిపోయింది. సెన్సెక్స్ కూడా గత ఏడు సెషన్లలో ఆరింటిలో బలహీనపడింది. దాదాపు 2.1% నష్టాలను నమోదు చేసింది. మరి ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి, అంతర్జాతీయ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కూడా మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది.నిఫ్టీ వరుసగా ఏడు సెషన్లలో పతనం కావడం గత ఐదేళ్లలో కేవలం రెండోసారి మాత్రమే జరిగింది. గతంలో, 2025 మార్చిలో నిఫ్టీ పది వరుస సెషన్లలో పడిపోయింది. ఈ ఏడాది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIలు) భారత ఈక్విటీలను భారీగా విక్రయించారు. ఈ ఏడాది ఏకంగా 25 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అయితే నిన్న కొనుగోళ్లకు తిరిగి వచ్చినప్పటికీ, ఈరోజు మళ్లీ విక్రయాలకే మొగ్గు చూపారు. ఈ భారీ విక్రయాలు కూడా స్టాక్ మార్కెట్ సూచీల పతనానికి ఒక కారణం. ఐటీ స్టాక్‌లు మాత్రం కొంతవరకు అవుట్ పెర్ఫార్మ్ చేశాయి. బలహీనపడిన రూపాయి మరియు వాల్యూ బయ్యింగ్ మద్దతుతో హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, జే.ఎస్.డబ్ల్యూ స్టీల్, మరియు సన్ ఫార్మా వంటివి లాభపడ్డాయి. నివేదికల ప్రకారం, ఈ ఏడాది (2026) విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIలు/FPIలు) భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీనికి విరుద్ధంగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) మార్కెట్‌కు స్థిరత్వాన్ని అందించాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)ల ద్వారా నెలకు సుమారు 30,000 కోట్ల రూపాయల స్థిరమైన ప్రవాహాలు దేశీయ మార్కెట్‌కు బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. ఈరోజు మార్కెట్లో పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టర్బో, ఐటిసి, హిందుస్తాన్ యునిలివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఈ కంపెనీల షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. దీనికి భిన్నంగా, ఐటీ రంగంలోని కొన్ని కంపెనీలు, మెటల్, మరియు ఫార్మా రంగ షేర్లు కొంత మేర లాభాలను ఆర్జించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో షేర్ మార్కెట్ ట్రెండ్ గ్లోబల్ పరిణామాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ పరిస్థితుల్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచింది. దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు.