రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో సారా అర్జున్ ?

Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలపై అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొన్న చిత్రం RC17. స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినిమా అధికారికంగా ప్రారంభం కాకముందే దీనికి సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల సర్జరీ చేయించుకున్న ఆయన కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు పూర్తిగా కోలుకున్న తర్వాత తదుపరి సినిమా షూటింగ్‌లలో పాల్గొనే అవకాశముంది. ఇదే సమయంలో దర్శకుడు సుకుమార్ మాత్రం RC17 ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా బిజీగా ఉన్నారని సమాచారం. కథ, స్క్రీన్‌ప్లే, పాత్రల రూపకల్పనతో పాటు నటీనటుల ఎంపికపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా గురించి మొదటి నుంచి వస్తున్న వార్తల్లో హీరోయిన్ ఎంపికే ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది. స్టార్టింగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు బలంగా వినిపించింది. ఇప్పటికే రామ్ చరణ్‌తో ఆమెకు మంచి పరిచయం ఉండటంతో మరోసారి ఈ జంట కలిసి నటించే అవకాశముందని ప్రచారం జరిగింది. అంతేకాదు, నిర్మాతలు కూడా కియారాను సంప్రదించినట్లు అప్పట్లో టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వచ్చాయి.రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా ఇప్పటికే రెండు సినిమాల్లో కనిపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో తొలిసారి ఇద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్లో మరోసారి కలిసి కనిపించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ తెరపై ఈ జంటకు మంచి కెమిస్ట్రీ ఉందని అభిమానులు భావిస్తుంటారు. అందుకే మూడోసారి కూడా ఇద్దరూ కలిసి నటిస్తారని చాలామంది ఎదురుచూశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ ఎంపిక విషయంలో సుకుమార్ టీమ్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కియారా అద్వానీ స్థానంలో మరో యువ నటి పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సారా అర్జున్. ఇటీవల విడుదలైన ధురంధర్ సినిమాలో యలీనా పాత్రలో సారా అర్జున్ కనిపించింది. ఆ పాత్ర ద్వారా మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వస్తోందనే ప్రచారం మొదలైంది. ఇదే నిజమైతే సారా కెరీర్‌లో ఇది అతిపెద్ద అవకాశంగా మారుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కథలో భాగంగా హీరోయిన్ పాత్ర కూడా బలంగా ఉండేలా ఆయన రాస్తారు. కేవలం పాటలకే పరిమితమయ్యే పాత్రల కంటే కథను ముందుకు నడిపించే పాత్రలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే RC17 కోసం కూడా కొత్త ముఖాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్తపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు రామ్ చరణ్ సరసన కొత్త హీరోయిన్‌ను చూడాలని కోరుకుంటుండగా, మరికొందరు మాత్రం కియారా అద్వానీయే ఈ పాత్రకు సరైన ఎంపిక అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సారా అర్జున్ పేరు బయటకు రావడంతో ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *