తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్…భూభారతి పోర్టల్‌లో అదిరిపోయే అప్‌డేట్

Spread the love

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం భూభారతి  పోర్టల్‌ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భూభారతి పోర్టల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. ఒకే ఒక్క అప్లికేషన్‌తో రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా వెసులుబాటును అందిస్తోంది. గతంలో భూమికి సంబందించిన రికార్డుల్లో తప్పులు ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడేవారు. ఉదాహరణకు, ఒక రైతుకు తన భూమి విస్తీర్ణం తప్పుగా పడి, అదే సమయంలో పట్టాదారు పేరులో కూడా అక్షర దోషం ఉంటే.. ఈ రెండు సమస్యలకు విడివిడిగా మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ప్రతి దరఖాస్తుకూ వేర్వేరుగా ఫీజులు కట్టాలి, వేర్వేరు ఫైళ్లు పెట్టుకుని ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. ఈ ప్రాసెస్ అంతా రైతులకు తీవ్రమైన ఇబ్బందిగా మారేది. దీనివల్ల రైతుల సమయం, డబ్బు వృధా అవ్వడమే కాకుండా, రెవెన్యూ ఆఫీసుల్లో దళారుల బెడద కూడా విపరీతంగా పెరిగిపోయింది. సరిగ్గా ఈ సమస్యను గుర్తించిన రెవెన్యూ శాఖ, ఒకే అప్లికేషన్‌తో అన్ని సమస్యలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది .  

నూతన నిబంధనల ప్రకారం, ఇప్పుడు రైతులకు తమ భూమిపై ఎన్ని రకాల సమస్యలు ఉన్నా..వాటన్నింటికీ కలిపి ఒకే ఒక్క దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.  భూమి విస్తీర్ణం తప్పుగా నమోదు కావడం, సర్వే నంబర్ తప్పు పడటం, సబ్ డివిజన్ పొరపాట్లు, పట్టాదారు పేరు సరిదిద్దడం, వారసత్వ మార్పులు అంటే సక్సెషన్ , సరిహద్దు వివాదాలు, పాస్ పుస్తకంలో వివరాల నమోదు.. అలాగే అత్యంత సమస్యాత్మకమైన నిషేధిత జాబితా అంటే సెక్షన్ 22A లిస్ట్ కు సంబందించిన సమస్యలు.. ఇలా రైతుకు తన భూమిపై ఒకేసారి మూడు నాలుగు రకాల తప్పులు ఉన్నా, ఇకపై వాటన్నింటినీ విడివిడిగా కాకుండా ఒకే దరఖాస్తు ద్వారా భూభారతి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇది నిజంగా రాష్ట్రంలోని లక్షలాది మంది భూ యజమానులకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. అయితే ఈ క్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి ఒక కీలకమైన విషయం చెప్పారు. రెవెన్యూ సేవల పారదర్శకత కోసం, ఇకపై ప్రతి భూ సమస్యను తప్పనిసరిగా ఆన్‌లైన్ లోనే నమోదు చేయాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత, రైతులు సమర్పించిన ఆ ఒక్క అప్లికేషన్ ఆధారంగానే అధికారులు సమగ్రంగా విచారణ జరుపుతారు. ఒకేసారి క్షేత్రస్థాయికి వెళ్లి, ఆ దరఖాస్తులో ఉన్న సమస్యలన్నింటినీ ఒకే విడతలో పరిశీలించి పరిష్కరిస్తారు. దీనివల్ల ఫైళ్లు నెలల తరబడి పెండింగ్ లో ఉండే అవకాశం ఉండదు. రైతులకు కూడా పదే పదే అధికారుల బతిమాలుకునే బాధ తప్పుతుంది. 

ఈ నూతన సంస్కరణ వల్ల ప్రభుత్వానికి , రైతులకు ఇద్దరికీ లాభం ఉంది. అధికారులకు కూడా ఒకే రైతుకు సంబందించిన ఫైళ్లను పదే పదే చూడాల్సిన అవసరం తప్పుతుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న భూ రికార్డుల ప్రక్షాళన చాలా వేగవంతం అవుతుంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని, తద్వారా అవినీతికి కూడా పూర్తిగా చెక్ పడుతుందని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. ఎవరైతే సంవత్సరాల తరబడి భూ సమస్యలతో, రికార్డుల తప్పులతో ఇబ్బంది పడుతున్నారో, వారందరికీ ఈ భూభారతి సింగిల్ అప్లికేషన్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.  మొత్తం మీద చూసుకుంటే, రైతుల కష్టాలను అర్థం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సింగిల్ అప్లికేషన్ నిర్ణయం నిజంగా హర్షించదగ్గది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రైతుల భూ సమస్యలన్నీ చాలా సులభంగా క్లియర్ కాబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *