నేపాల్ లో జలప్రళయం ఏస్థాయిలో భీభత్సం సృష్టించిందో తెలిసిందే. అకస్మాత్తుగా క్షణాల్లో ముంచెత్తిన ఈ వరదలు నేపాల్‌లో పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఈ భయంకరమైన విపత్తులో ఇప్పటి వరకు దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోగా.. భారతదేశంతో పాటు చైనాకు చెందిన వందలాది మంది పర్యాటకులు గల్లంతయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జలప్రళయానికి సంబందించిన వీడియోలు చూస్తుంటేనే ప్రపంచం హడలిపోతోంది. ఇక దీనిపై మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒక కచ్చితమైన సమాధానం అందించింది. తమ శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషణ చేసి, నేపాల్ వరదల వెనుక ఉన్న ఆ భయంకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. నేపాల్‌లో ఇంతటి ఘోర విపత్తు జరగగానే, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెంటనే రంగంలోకి దిగింది. అంతరిక్షం నుంచి ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్కాన్ చేసింది. ఆగస్టు 26న ఉదయం 10 గంటల30 నిమిషాల సమయంలో ఇస్రోకు చెందిన రిసోర్సాట్-2ఏ ఉపగ్రహంలోని సెన్సార్ అత్యంత స్పష్టమైన చిత్రాలను సేకరించింది. ఈ కొత్త చిత్రాలను, ప్రమాదానికి ముందు తీసిన పాత ఉపగ్రహ చిత్రాలతో మన శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. అప్పుడు భూభాగం , నది వ్యవస్థలో వచ్చిన భయంకరమైన మార్పులను వాళ్లు గుర్తించారు. త్రిశూలి నదికి సమీపంలోని ఎత్తైన పర్వత ప్రాంతంలో భారీగా మార్పులు చోటుచేసుకున్నట్లు ఇస్రో గుర్తించింది. నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో భూభాగం పూర్తిగా చీలిపోయి, నది ప్రవాహం విపరీతంగా విస్తరించి, దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరినట్లు ఈ ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.ఇస్రో రిపోర్ట్ ప్రకారం అసలు అక్కడ ఏం జరిగింది? NRSC ప్రాథమిక అంచనా ప్రకారం.. ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉండే ఒక అతిపెద్ద హిమనదం అంటే మంచుకొండ అకస్మాత్తుగా కూలిపోవడమే ఈ విపత్తుకు అసలు కారణమని తేలింది. మంచు ,రాళ్లతో కూడిన భారీ కొండచరియలు హిమపాతం తరహాలో విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వేలాది టన్నుల కొద్ది మంచు, రాళ్లు, ఇతర శిథిలాలు ఒక్కసారిగా కిందికి కొట్టుకువచ్చాయి. ఇలా పడిన ఆ భారీ శిథిలాల కారణంగా నది ప్రవాహానికి అడ్డంగా ఒక తాత్కాలిక డ్యామ్ లాంటి అడ్డంకి ఏర్పడింది. దీంతో పైనుంచి వస్తున్న నీరంతా ఒకచోట భారీగా నిలిచిపోయి, ఆ ఒత్తిడికి ఆ అడ్డంకి ఒక్కసారిగా బద్దలైంది. దాని ఫలితంగానే ఇంత పెద్ద జలప్రళయం సంభవించింది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆకట్ట బద్దలైనప్పుడు నీటితో పాటు మంచు, రాళ్లు, మట్టి లాంటి శిథిలాలు కూడా అత్యంత వేగంగా దిగువకు కొట్టుకురావడంతో త్రిశూలి నది వెంట ఈ భారీ ప్రళయం ఏర్పడింది. ఇస్రో విశ్లేషణ ప్రకారం, ఆ మంచుకొండలో దాదాపు మూడింట రెండు వంతుల భాగం పూర్తిగా విడిపోయి కూలిపోయినట్లు అంచనా వేశారు. ఆగస్టు 24న తీసిన సెంటినెల్-2 ఉపగ్రహ చిత్రంలో పచ్చగా, తెల్లగా ఒక అందమైన హిమనదంగా కనిపించిన ఆ ప్రాంతం.. విపత్తు తర్వాత ఆగస్టు 26న తీసిన ల్యాండ్‌శాట్-9 చిత్రంలో పూర్తిగా ధ్వంసమై, రాళ్లు రప్పలతో నిండిపోయిన ప్రాంతంగా మారిపోయింది. ఈ శిథిలాల ప్రవాహం వల్ల భోటే కోసి నది వెడల్పు బాగా పెరిగిపోయింది. నది ప్రవాహం సాధారణంగా ఉండే మార్గాన్ని దాటేసి, పక్కనే ఉన్న లోయ ప్రాంతాల్లోకి, ఊళ్లలోకి చొరబడింది. దీని ప్రభావం నేరుగా రసువా జిల్లాలోని రసువాగఢి, టిమురే ప్రాంతాలతో పాటు నేపాల్-టిబెట్ సరిహద్దు గ్రామాలపై తీవ్రంగా పడింది. ఇంత భారీ స్థాయిలో రాళ్లు, మంచు, మట్టి ఒక్కసారిగా ఊళ్ల మీదకు దూసుకురావడంతో ఎవరికీ తప్పించుకునే సమయం కూడా దొరకలేదు. అయితే ప్రస్తుత శాటిలైట్ విశ్లేషణలో ఇస్రో కొన్ని పరిమితులను కూడా వెల్లడించింది. వరద నీటిలో మునిగిన మొత్తం ప్రాంతం కచ్చితంగా ఎంత? ఎంత పరిమాణంలో శిథిలాలు కొట్టుకువచ్చాయి? అన్న కచ్చితమైన లెక్కలను ఇంకా నిర్ధారించలేదు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడమే. ప్రభావిత ప్రాంతంలోని చాలా భాగాలు దట్టమైన మేఘాలతో కప్పబడి ఉండటం వల్ల, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా భూమిపై జరిగిన పూర్తి స్థాయి విధ్వంసాన్ని అంచనా వేయడం కొంచెం కష్టంగా మారింది. ప్రస్తుతం అందిన ఈ నివేదిక కేవలం ప్రాథమికమైనదేనని , మేఘాలు తొలగిపోయి వాతావరణం క్లియర్ అయిన తర్వాత మరింత సమగ్రమైన అధ్యయనం చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంతరిక్ష శాఖ స్పష్టం చేసింది. మొత్తం మీద నేపాల్ వరదల వెనుక కేవలం వర్షాలు మాత్రమే కాకుండా, గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగిపోతున్న హిమానీనదాలు కూడా కారణం అని ఇస్రో ఇచ్చిన ఈ రిపోర్ట్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తోంది.