ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వైమానిక పోరాట విన్యాసాలకు రంగం సిద్ధం చేసింది. దీని కోసం సివిల్ ఏవియేషన్ అథారిటీలకు ముందస్తు సమాచారం ఇస్తూ నోటామ్ జారీ చేసింది. దీని ప్రకారం జైసల్మేర్, ఫలోడి, బికనీర్, జోధ్‌పూర్ ప్రాంతాలకు సమీపంలోని భారీ గగనతలాన్ని సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రత్యేక సైనిక కార్యకలాపాల కోసం రిజర్వ్ చేశారు. ఈ గగనతలంలోని కొన్ని ప్రాంతాలు అంతర్జాతీయ పాక్ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల సమీపం వరకు విస్తరించి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విన్యాసాల్లో మన ఫైటర్ జెట్స్ సుమారు 40,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరి టార్గెట్లను ఛేదించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రోజంతా పలు దశల్లో రేయింబవళ్లు ఈ వైమానిక శిక్షణ కొనసాగనుంది. గతంలో నిర్వహించిన విన్యాసాలతో పోలిస్తే ఈసారి కేటాయించిన గగనతల ప్రాంతం చాలా పెద్దది కావడం విశేషం. కేవలం మన దేశీయ విన్యాసాలు మాత్రమే కాదు.. అంతర్జాతీయ దేశాలతో భారత రక్షణ బంధం ఏ స్థాయిలో ఉందో నిరూపించే సంయుక్త విన్యాసాలు కూడా ఇదే జోధ్‌పూర్ బేస్‌గా జరగబోతున్నాయి. చైనా , పాకిస్తాన్ లాంటి దేశాలకు చెక్ పెట్టే క్రమంలో జపాన్‌తో భారత్ వ్యూహాత్మక బంధాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 9 నుంచి 21 వరకు జోధ్‌పూర్ వైమానిక స్థావరంలో భారత్ – జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు వీర్ గార్డియన్ 26 అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జపాన్ ఎయిర్ సెల్ఫ్ – డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన మూడు F-2A యుద్ధ విమానాలతో పాటు సుమారు 110 మంది సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొననున్నారు. జపాన్‌కు చెందిన ఎఫ్-2ఏ యుద్ధ విమానాలు నేరుగా భారతీయ వైమానిక స్థావరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ, గగనతల పోరాట శిక్షణలో పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. దీని ద్వారా ఇరు దేశాల పైలట్లు తమ పోరాట వ్యూహాలను, టెక్నాలజీని పంచుకోనున్నారు.
జపాన్‌తో విన్యాసాలు ముగిసిన వెంటనే.. భారత వైమానిక దళం మరో భారీ బహుళజాతి విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. దాని పేరే తరంగ్ శక్తి 2026. వీర్ గార్డియన్ ముగిసిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా తరంగ్ శక్తి 2026 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 12 వరకు జోధ్‌పూర్ వేదికగానే జరగనున్న ఈ విన్యాసాల్లో ప్రపంచంలోని పలు అగ్ర దేశాల వైమానిక దళాలు పాల్గొనబోతున్నాయి. సంక్లిష్టమైన బహుళజాతి వైమానిక కార్యకలాపాలు నిర్వహించడం, యుద్ధ సమయాల్లో మిత్ర దేశాలతో పరస్పర సమన్వయం ఎలా చేసుకోవాలి? సంయుక్త ఆపరేషన్ల సామర్థ్యాలను ఎలా పెంపొందించుకోవాలి? అన్న అంశాలపై ఇందులో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం కూతవేటు దూరంలో ఇలాంటి భారీ కార్యకలాపాలు జరగడం వల్ల వీటికి గ్లోబల్ డిఫెన్స్ సర్కిల్స్‌లో విపరీతమైన వ్యూహాత్మక ప్రాధాన్యత పెరిగింది.
ఇక ఈ ఆపరేషన్స్ జరిగే సమయంలో వాణిజ్య విమానాల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. విన్యాసాల సందర్భంగా రిజర్వ్ చేసిన గగనతలంలో పౌర విమానాల రాకపోకలకు పరిమితులు విధిస్తారు. ముఖ్యంగా 2025 నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య అమల్లో ఉన్న పరస్పర విమాన ఆంక్షల నేపథ్యంలో పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో రాడార్ల ద్వారా మన అధికారులు పరిస్థితులను మరింత నిశితంగా పర్యవేక్షించనున్నారు. మొత్తంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పబోతున్నాయి. శత్రువుల గుండెల్లో గుబులు రేపేలా ఈ పోరాట విన్యాసాలు, భారత వైమానిక దళం ఆపరేషనల్ రెడీనెస్‌ను మరింత శిఖరాగ్రానికి తీసుకెళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.