పాక్ ఆర్మీని దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న BLA

Spread the love

బలూచ్ ప్రజల స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఏకంగా పాకిస్థాన్ మిలిటరీ కాన్వాయ్‌లపై వ్యూహాత్మకంగా మాటువేసి ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో సుమారు 32 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు బీఎల్ఏ అధికారికంగా ప్రకటించింది. బలూచిస్తాన్ ప్రాంతం భౌగోళికంగా చాలా కఠినమైనది. చుట్టూ ఎత్తైన కొండలు, లోయలతో నిండి ఉండే ఈ ప్రాంతం బీఎల్ఏ ఫైటర్లకు పెట్టని కోట. సరిగ్గా ఇక్కడే పాక్ ఆర్మీ కాన్వాయ్‌కు వారు చావుదెబ్బ రుచిచూపించారు. తాజాగా బలూచిస్తాన్ ఆర్మీ  విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. జియారత్ క్రాస్ అనే అత్యంత కీలకమైన ప్రాంతంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన భారీ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఎత్తైన కొండల మాటున ముందుగానే పొంచి ఉన్న బీఎల్ఏ ఫైటర్లు.. కాన్వాయ్ రాగానే నలుదిక్కుల నుంచి భారీ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. 

ఈ భీకర ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్ కాన్వాయ్‌లోని రెండు కీలక వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో సైనికులను తరలిస్తున్న ఒక పెద్ద ఆర్మీ ట్రక్ కూడా ఉండటం గమనార్హం. ఈ రెండు వాహనాలకు ఫైటర్లు నిప్పంటించారు. మొదట ఈ దాడిలో 18 మంది సైనికులు మరణించినట్లు BLA ప్రకటన విడుదల చేసింది. అయితే, గాయపడిన వారిలో కొందరు మరణించడంతో అనంతరం ఆ మరణాల సంఖ్యను 25కు పెంచుతూ సవరించింది. ఒకే దాడిలో 25 మంది పాక్ సైనికులు చనిపోవడం పాక్ మిలిటరీ చరిత్రలో ఒక పెద్ద కుదుపు అని చెప్పొచ్చు.సాధారణంగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు పాకిస్థాన్ మిలిటరీ వెంటనే దానిని ఖండిస్తుంది లేదా ఉగ్రవాదులను మేమే మట్టుబెట్టాం అని తప్పుడు ప్రకటనలు ఇస్తుంది. కానీ ఈసారి BLA పక్కా సాక్ష్యాలతో పాక్ కు కళ్లెం వేసింది. దాడికి సంబంధించిన వార్తలను పాక్ మీడియా పూర్తిగా సెన్సార్ చేసింది. అయితే, దీనికి ధీటుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన అధికారిక మీడియా వింగ్ అయిన హక్కల్   ఛానల్ ద్వారా ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జియారత్ క్రాస్ వద్ద పాక్ కాన్వాయ్‌పై తమ ఫైటర్లు ఎలా దాడి చేశారు? ఆర్మీ ట్రక్కులు మంటల్లో ఎలా కాలిపోతున్నాయి? అనే దృశ్యాలను స్పష్టంగా చూపించారు. పాక్ సైన్యం చెప్పే అబద్ధాలను తిప్పికొట్టేందుకు ఈ వీడియోను రిలీజ్ చేసినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాదు, ఇది కేవలం ఒక ప్రోమో లాంటి పూర్తికాని వీడియో మాత్రమేనని.. దాడికి సంబంధించిన పూర్తి స్థాయి హెచ్‌డీ వీడియోను త్వరలోనే ప్రపంచం ముందుకు తీసుకువస్తామని BLA ప్రకటించడం పాక్ ఆర్మీలో గుబులు పుట్టిస్తోంది. జియారత్ క్రాస్ దాడి మరువక ముందే.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ సైన్యంపై మరో భారీ దాడి జరిగింది. ఈసారి దాడి చేసింది సాధారణ ఫైటర్లు కాదు.. BLA కి చెందిన అత్యంత ప్రమాదకరమైన విభాగం స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్  . బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సురాబ్ సమీపంలో ఉన్న హజికా ప్రాంతంలో కూడా పాకిస్థాన్ ఆర్మీకి చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పాక్ ఆర్మీ వాహనంపై BLA కు చెందిన  STOS మెరుపు దాడి చేసింది. ఈ స్క్వాడ్ పూర్తిగా గెరిల్లా వార్ ఫేర్ ,  ఐఈడీ  బ్లాస్ట్‌లలో శిక్షణ పొంది ఉంటుంది. వీరు ముందుగానే రోడ్డుపై పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని పార్క్ చేసి, ఆర్మీ కాన్వాయ్ సరిగ్గా ఆ ప్రాంతానికి రాగానే రిమోట్ కంట్రోల్ ద్వారా దానిని పేల్చేశారు. ఈ భయంకరమైన పేలుడు ధాటికి ఒక ఆర్మీ వాహనం ముక్కలుముక్కలైంది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు పాకిస్థాన్ సైనికులు అక్కడికక్కడే మరణించినట్లు BLA స్పష్టం చేసింది. ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినా, 32 మంది సైనికులు చనిపోయినా కూడా పాకిస్థాన్ మిలిటరీ మీడియా వింగ్  ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. తమ బలగాల్లో నైతిక స్థైర్యం  దెబ్బతింటుందనే భయమే దీనికి కారణంగా తెలుస్తోంది. బలూచిస్తాన్ వనరులను దోచుకుంటూ, స్థానిక బలూచ్ ప్రజలను అణిచివేస్తున్న పాక్ ప్రభుత్వానికి.. BLA చేస్తున్న ఈ దాడులు ఇప్పుడు మింగుడుపడటం లేదు. చైనా సహకారంతో నడుస్తున్న సీపెక్  ప్రాజెక్టులకు కూడా ఈ దాడులు తీవ్ర అడ్డంకిగా మారాయి.మరి తమ హక్కుల కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఈ పోరాటం పాకిస్థాన్ ను మరోసారి ముక్కలు చేస్తుందా  లేదా పాక్ బలూచ్ లపై  రివేంజ్ తీర్చుకుంటుందా అన్నది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *