కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం కౌటాలలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ గారు గిరిజనులకు 6 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకుంటే, రేవంత్ రెడ్డి ఉన్న భూములను గుంజుకుంటున్నాడని విమర్శలు గుప్పించారు. నా పేద రైతుల భూములు గుంజుకోవద్దు, వారి గొంతు నొక్కొద్దు అని మా కోనప్ప గారు ఈ మీటింగ్ పెడితే రైతుల కష్టాలు చూసి బాధేసింది. నేను హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే రెండు లక్షల ఇండ్లను 22ఏ లో పెట్టారనుకున్నా. కానీ, ఒక్క సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలోనే ఏకంగా 42,867 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి రైతుల నోటికాడ బుక్కను రేవంత్ రెడ్డి లాక్కున్నాడు. కౌటాలలో 6,350 ఎకరాలు, చింతల మానేపల్లిలో అత్యధికంగా 8,878 ఎకరాలు, బెజ్జూరులో 8,325 ఎకరాలు, కాగజ్‌నగర్‌లో 6,690, సిర్పూర్ టీలో 4,406, పెంచికల్ పేట్లో 2,950, దహేగాంలో 5,268 ఎకరాలను రాత్రికి రాత్రే బ్లాక్ లిస్టులో పడేశారని ఫైర్ అయ్యారు. భూములు 22ఏ లో పడితే రైతుల బతుకులు ఆగమాగం అవుతాయి. ఇందాక ఇక్కడ విజయలక్ష్మి, భీంబాయి, మల్లవ్వ లాంటి రైతులు చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయన్నారు. పాత అప్పు కట్టి, కొత్త లోన్ కోసం పోతే మీ భూమి గవర్నమెంట్ తీసుకుందంటూ బ్యాంక్ మేనేజర్లు వారిని బయటకు పంపేశారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్ వల్ల భూమి పేరు మీద లేకపోతే రేపు యూరియా, డీఏపీ కూడా దొరకదు, రైతుబంధు రాదు, ప్రమాదం జరిగితే బీమా రాదు. ఆడబిడ్డ పెళ్లి చేద్దామని భూమి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కుదరదంటున్నాడు. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా తిరిగినా న్యాయం జరగట్లేదు. రైతుల పాలిట ఈ 22ఏ ఒక ఉరితాడులా మారిందని కేసీఆర్ ప్రజలే కేంద్ర బిందువుగా పాలన చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం భూములే కేంద్ర బిందువుగా పాలన చేస్తున్నాడు. ఎవరి భూములు గుంజుకోవాలి, ఎవరిని 22ఏ లో పెట్టాలి, ఎవరిని బెదిరించాలి అనేదే కాంగ్రెస్ విధానమని హరీష్ రావు ధ్వజమెత్తారు. ఒకప్పుడు ల్యాండ్ గ్రాబర్లు భూములు కబ్జా చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే కబ్జాదారుగా మారి రాష్ట్రవ్యాప్తంగా 14.50 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిందని దుయ్యబట్టారు. సిర్పూర్ రైతులు, ఇక్కడ దరఖాస్తులు ఇచ్చిన 40 వేల మంది రైతులు దొంగలా? కబ్జాదారులా? హైదరాబాద్‌లో కూర్చుని పేద రైతులను దొంగలు అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పట్టా భూములను లాక్కుంటోంది. 100 ఏళ్ల కిందటి రికార్డులు తీసి, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ భూములను 22ఏ లో పెట్టాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు. అంటే ఇది అధికారుల తప్పు కాదు, రేవంత్ రెడ్డి చేయిస్తున్న కుట్ర. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా నిషేధిత జాబితాలో పెట్టలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. ఇన్ని లక్షల మంది ఆస్తులను రాత్రికి రాత్రే సున్నా వాల్యూ చేసి, అడ్డగోలుగా మాట్లాడిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధిత జాబితాలో పెట్టాలన్నారు. హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఏ లో పడింది. నేను ఆ విషయం బయటపెట్టగానే ముఖ్యమంత్రి హోదాలో రాత్రికి రాత్రే తన ఇంటిని ఆ లిస్టులో నుంచి తీసేసుకున్నాడని రేవంత్ రెడ్డి ఇల్లు తీసినట్టే సిర్పూర్లో పెట్టిన 40 వేల ఎకరాలను కూడా వెంటనే 22ఏ నుంచి తొలగించాలి. లేదంటే లక్షలాది మంది రైతులతో సెక్రటేరియట్‌ను, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడిస్తాం. ఈ పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధించాలని మండిపడ్డారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో 1000 కుంభకోణాలు, 1000 కబ్జాలు, 1000 అబద్ధాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. 33 నెలలైనా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. నెలకు రూ.4,000 ఇస్తామని చెప్పి ప్రతి అవ్వకు, తాతకు ఈ ప్రభుత్వం రూ.66,000 బాకీ పడింది. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 చొప్పున రూ.82,500 బాకీ పడింది. ఈ నియోజకవర్గంలో ఎవరెన్ని కుట్రలు చేసినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. మళ్లీ కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రతి అవ్వా తాత, అక్కా చెల్లెలు నమ్ముతున్నారు. దళారులను నమ్మి రైతులు రూపాయి లంచం ఇవ్వొద్దు, మీ భూములు మీకు దక్కేంతవరకు బీఆర్ఎస్ పార్టీ అండగా కొట్లాడుతుందని భరోసానిచ్చారు.