టాలీవుడ్‌ కు ఇరుముడి నేర్పిన పాఠం.. మాములు బడ్జెట్ తో.. అదిరిపోయే హిట్

Spread the love

ఏ పరిశ్రమలోనైనా సినిమాకు భారీ ప్రేక్షకాదరణ ఉండాలంటే మంచి కంటెంట్, గుండెకు హత్తుకునే ఎమోషన్ ఉంటే సరిపోయేది. అయితే  రాను రాను పాన్ ఇండియా అనే పదం ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు ఒక వ్యసనంలా మారిపోయింది. వందల కోట్ల భారీ బడ్జెట్, భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సులు, ఫారిన్ లొకేషన్లు, ఇతర భాషల నటీనటులు ఉంటేనే దేశవ్యాప్తంగా కలెక్షన్స్ వస్తాయనే భ్రమలోఉన్న సమయంలో ఈ పాన్ ఇండియా ట్రెండ్ కే చెక్ పెడుతూ.. కేవలం 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో వచ్చిన ఒక అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఆ సినిమానే మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి.   ఇరుముడి సినిమా ఒక సింపుల్ అండ్ స్ట్రాంగ్ పాయింట్ తో తెరకెక్కింది. కూతురి కోసం ప్రాణమిచ్చే తండ్రి, అయ్యప్ప స్వామి మీద అతనికి ఉన్న అపారమైన భక్తి.. ఈ రెండు అంశాల చుట్టూ అల్లుకున్న అద్భుతమైన ఎమోషనల్  మూవీ ఈ ఇరుముడి.  

రవితేజ అనగానే మనకు గుర్తొచ్చే మాస్ డైలాగులు, గ్లామర్ హీరోయిన్స్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ హంగులను పూర్తిగా పక్కనపెట్టేశారు. పాత్రకు తగినట్లు ఆయన చేసిన నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ఆడపిల్లల భద్రత అనే సున్నితమైన అంశాన్ని దర్శకుడు డీల్ చేసిన విధానం, అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు వచ్చే మల్లెపూల పల్లకి యాక్షన్ బ్లాక్.. ఇలా ప్రతి సీన్ స్థానిక ప్రేక్షకుడి గుండెకు హత్తుకునేలా, సహజత్వానికి  దగ్గరగా రూపొందించారు. సినిమా అంటే ఎమోషనే కాదు, లెక్కలు కూడా ముఖ్యం. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 50 కోట్లు మాత్రమే. కానీ విడుదలైన కేవలం 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మార్క్‌ను దాటేసి, 300 కోట్ల వైపు దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడికి ఏకంగా మూడు, నాలుగు రెట్ల లాభం వస్తోంది.  ఇరుముడికి పోటీగా భారీ బడ్జెట్ తో, హంగు ఆర్బాటాలతో వచ్చిన టాక్సిక్  లాంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నప్పటికీ, ఇరుముడి ప్రభంజనం ముందు అవి నిలబడలేకపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళంలో డబ్ చేసిన వెర్షన్ కు కూడా అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. దీనికి కారణం.. ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా తండ్రీకూతుళ్ల బంధం, భావోద్వేగం అనేది ఎక్కడైనా ఒకటే. కంటెంట్ కనెక్ట్ అయితే వసూళ్ల వర్షం కురుస్తుందని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరూపించింది. 

ఇక ఈ సినిమా దర్శకుడు శివ నిర్వాణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో ప్రేక్షకుడిని కట్టిపడేసి, సెకండ్ హాఫ్ లో ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమాను ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ మోడ్ లోకి తీసుకెళ్లిన విధానం అద్భుతం. ఒక స్టార్ హీరో ఇమేజ్ ని పక్కనపెట్టి కథను మాత్రమే నమ్మి సినిమా తీశాడు.  రవితేజ తన కెరీర్ లోనే బెస్ట్ అండ్ సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏ దశలోనూ ఆయన ఓవర్ ది బోర్డ్ వెళ్ళలేదు. ఇక ఆయన కూతురు మణెమ్మగా నటించిన కేరళకు చెందిన బేబీ నక్షత్ర.. కేవలం కళ్లతోనే హావభావాలు పలికించి అందరి మనసులు గెలుచుకుంది. భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్, గురుస్వామిగా సాయికుమార్ పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. ఇరుముడి సాధించిన ఈ విజయం ఇప్పుడు టాలీవుడ్ లో, నేషనల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. గత కొంతకాలంగా పాన్ ఇండియా మోజులో పడి, ఒకేసారి ఐదారు భాషల్లో సినిమాలను భారీ ఖర్చుతో రిలీజ్ చేయాలనే అత్యాశతో తెలుగు నిర్మాతలు ఏకంగా 600 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. ఒక సినిమా తీసేటప్పుడు మన తెలుగు నేటివిటీని వదిలేసి, నార్త్ వాళ్ళకి నచ్చాలని హిందీ యాక్టర్లను, తమిళ్ వాళ్ళకు నచ్చాలని అక్కడి వాళ్ళను పెట్టి ఒక కిచిడీ చేస్తున్నారు. దీనివల్ల ఇటు మనవాళ్లకు ఎక్కక, అటు వాళ్ళకు కనెక్ట్ అవ్వక సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి.  కానీ మలయాళ, తమిళ పరిశ్రమలు ఇలా చేయడం లేదు. వాళ్ళ సంస్కృతి, యాస, భావోద్వేగాలను నమ్ముకునే సినిమాలు తీస్తున్నారు. ఇరుముడి తో పాటు ఇటీవల వచ్చిన మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కంటెంట్ బలంగా ఉంటే, దానంతట అదే గ్లోబల్ రీచ్ వస్తుందని, ముందు మన ఇంట   గెలిచి, తర్వాత రచ్చ గెలవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *