ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు ఉచిత కరెంట్ అందిస్తామని మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాలని, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదని ఏపీ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగానే మంత్రి నారా లోకేష్ ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు, గణనాథుడి భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులపై ఆర్థిక భారం పడకుండా, పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వార్తతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉత్సవ సమితి సభ్యులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఉచిత కరెంట్ కదా అని ఎవరికి పడితే వాళ్లు, ఇష్టం వచ్చినట్లు వైర్లు లాగేసుకుంటే కుదరదు. దీనికోసం విద్యుత్ శాఖ పక్కా ప్లానింగ్ తో ముందుకు వస్తోంది. గణేష్ మండపాలకు కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా అధికారికంగా తాత్కాలిక కనెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తాత్కాలిక విద్యుత్ సరఫరా ఈ నెల 26వ తేదీ వరకు అంటే నిమజ్జనోత్సవాలు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.మరి ఈ అధికారిక కనెక్షన్ ఎలా పొందాలి? అంటే చాలా సింపుల్. మండపాల నిర్వాహకులు తమకు సమీపంలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లొచ్చు. లేదా మీ-సేవ కేంద్రాలు, లేదంటే APCPDCL అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కరెంట్ వాడకం ఉచితమే అయినప్పటికీ, అధికారిక కనెక్షన్ తీసుకునేటప్పుడు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద కేవలం 100 రూపాయలు చెల్లించాలి. ఇక 500 వాట్ల సామర్థ్యం ఉన్న మండపాలకు 1,000 రూపాయలు, 1,000 వాట్ల సామర్థ్యానికి 2,250 రూపాయలు నామమాత్రపు అధికారిక డిపాజిట్ గా చెల్లించి కనెక్షన్ పొందాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల సిస్టమాటిక్ గా పవర్ సప్లై జరుగుతుంది, ఎలాంటి ప్రమాదాలకు తావుండదు.
ఇక అక్రమ కనెక్షన్లపై విద్యుత్ శాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మెయిన్ లైన్ల నుంచి నేరుగా విద్యుత్ వైర్లు లాగడం, విద్యుత్ చోరీ వంటి చర్యలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని సీఎండీ పుల్లారెడ్డి హెచ్చరించారు. అక్రమ విద్యుత్ వినియోగాన్ని గుర్తించేందుకు పండుగ రోజుల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు రంగంలోకి దిగుతున్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి, ప్రమాదాలకు కారణమయ్యే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కేవలం 100 రూపాయల ప్రాసెసింగ్ ఫీజుతో అధికారికంగా కనెక్షన్ తీసుకుని, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా గణనాథుడి పూజలు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.