భారత్‌కు మరో గర్వకారణమైన ఘట్టం మరియు భారత బ్యాడ్మింటన్ కు మరొక అద్భుతమైన మైలురాయిగా నిలిచే థ్రిల్లింగ్ విజయం బ్యాడ్మింటన్ లో దక్కింది. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ ఛాంపియన్లుగా నిలిచి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. మొదటి గేమ్‌ను కోల్పోయిన తర్వాత, ఈ భారత ద్వయం అద్భుతంగా పుంజుకుని, చైనాకు చెందిన హే జీ టింగ్ మరియు రెన్ జియాంగ్ యు ద్వయంపై 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించింది. తద్వారా చైనా మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయులుగా చరిత్ర పుటల్లోకి ఎక్కడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసం మరియు నిరంతర పోరాట పటిమతో సాధించిన విజయం ఇది. మొదటి ర్యాలీ నుండి ఛాంపియన్షిప్ పాయింట్ వరకు, సాత్విక్‌సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓటమిని అంగీకరించకూడదని నిరూపించారని ప్రశంసలు వస్తున్నాయి. ఈ చారిత్రాత్మక విజయంతో ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన మొట్టమొదటి భారతీయ జంటగా వీరు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో సాత్విక్ చిరాగ్ జోడీకి గతంలోనూ మంచి రికార్డు ఉంది. గతంలో వీరు రన్నరప్‌గా నిలవడంతో పాటు సెమీఫైనల్స్ వరకు వెళ్లారు. కానీ ఎప్పుడూ తుది మెట్టుపై తడబడ్డారు. ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి ఆ లోటును భర్తీ చేశారు. ఏకంగా టైటిల్‌ను సొంతం చేసుకుని భారత బ్యాడ్మింటన్ స్థాయిని ప్రపంచ వేదికపై మరోసారి ఎత్తున నిలబెట్టారు.ప్రస్తుత సీజన్లో ఈ భారత జోడీకి ఇది రెండో టైటిల్ కావడం గమనార్హం. ఇప్పటికే సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌ను కూడా కైవసం చేసుకున్న వీరు, తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఈ జంట, రాబోయే పెద్ద టోర్నీలకు గట్టి సంకేతాలు పంపుతోంది.ఈ విజయంతో సాత్విక్ మరియు చిరాగ్ జోడీ తమ కెరీర్లో మొత్తం 10వ బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారు ప్రదర్శించిన నిలకడ యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ వేదికలపై భారత జెండాను సగర్వంగా ఎగురవేస్తున్న ఈ ద్వయం, కఠినమైన శిక్షణ మరియు మానసిక దృఢత్వమే తమ విజయాలకు ప్రధాన కారణమని నిరూపించారు.క్రీడా విశ్లేషకులు ఈ విజయాన్ని భారత బ్యాడ్మింటన్ రంగంలో ఒక మైలురాయిగా అభివర్షిస్తున్నారు. చైనా గడ్డపై చైనా ఆటగాళ్లను ఓడించడం సాధారణ విషయం కాదని, అది కూడా సూపర్ 750 స్థాయి టోర్నమెంట్లో ఈ స్థాయిలో పుంజుకోవడం వారి అసాధారణ పోరాట పటిమకు నిదర్శనమని నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఈ అపూర్వ విజయంతో భారత్ లో క్రీడా వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ క్రీడాకారులు ఈ చారిత్రాత్మక విజయం సాధించిన సాత్విక్-చిరాగ్ జోడీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా అభిమానులు ఈ జోడీని కొనియాడుతూ పోస్టులు చేస్తున్నారు.