అండమాన్ దీవులలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు యోచనలో కేంద్రం?

Spread the love

కేంద్ర ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవులలో అణు విద్యుత్ ప్రాజెక్టును నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ స్థలంలో, అత్యంత సురక్షితంగా పనిచేసే స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ల (SMR) వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ ప్రాంతం కేవలం పర్యాటక కేంద్రంగా మాత్రమే గుర్తింపు పొందింది. అయితే గత కొంతకాలంగా  మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అండమాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 75,000 కోట్ల పైచిలుకు వ్యయంతో గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టును నిర్మించనుంది.  ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్ (పోర్ట్), గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరియు కొత్త టౌన్‌షిప్‌లను నిర్మించనున్నారు. వీటన్నింటికీ భారీగా నిరంతర విద్యుత్ అవసరం అవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల బాబా  అటామిక్ రీసెర్చ్ సెంటర్  శాస్త్రవేత్తల బృందం ఈ దీవులలో పర్యటించింది.  ఈ పర్యటనలో వివిధ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.  ఈ అణు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా స్థానిక ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందే అవకాశం ఉంది. అయితే సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కలిగిన ఈ దీవులలో అణు రియాక్టర్ల ఏర్పాటు వల్ల ఎలాంటి ముప్పు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు ఆకాంక్షిస్తున్నారు. భవిష్యత్తులో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ విద్యుత్ భద్రత ఎంతో అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఆధునిక ప్రపంచానికి అవసరమైన స్వచ్ఛమైన మరియు నిరంతర విద్యుత్ శక్తిని అందించడంలో అణు విద్యుత్ ప్రాజెక్టులు  కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాంప్రదాయ బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే, అణు విద్యుత్ ద్వారా చాలా తక్కువ పరిమాణంలో ఉండే ఇంధనంతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. అణు విద్యుత్ కేంద్రాలను ప్రధాన భూభాగం (Mainland) లో కంటే నిర్జనమైన లేదా ప్రత్యేకమైన దీవులలో నిర్మించడం వల్ల భద్రత పరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల సమీపంలో, ముఖ్యంగా వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన మలక్కా జలసంధి మార్గానికి సమీపంలో  ఈ దీవులు ఉండటం వల్ల రక్షణ పరంగా కూడా నిరంతర విద్యుత్ సరఫరా అవసరాలు తీరతాయని ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ఇదొక మైలురాయిగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *