ఉత్తరప్రదేశ్ లోని లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఓం దివ్య దర్శన్ సంస్థాన్ అనే సంస్థ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఆవు పేడ నుంచి బయోగ్యాస్ లేదా బయో-సీఎన్‌జీ తయారు చేస్తారు. అయితే ఆ గ్యాస్ తీసేసిన తర్వాత మిగిలిపోయే ముద్ద నుంచి ఒక అత్యంత విలువైన పదార్థాన్ని వీరు సంగ్రహిస్తున్నారు. దాని పేరే నానో సెల్యులోజ్ దీన్నేఆల్ఫా నానో సెల్యులోజ్ అని కూడా పిలుస్తారు. ఈ నానో సెల్యులోజ్ అనేది చాలా అరుదైనది. ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది కానీ ఇది ఉక్కు కన్నా దృఢంగా ఉంటుంది. పేడలోని మూలకాలను ప్రాసెస్ చేసి తీసే ఈ నానో సెల్యులోజ్ కు.. విపరీతమైన వేగంతో దూసుకువచ్చే ప్రాణాంతక బుల్లెట్లను అడ్డుకునే శక్తి ఉంటుంది. అలాగే అంతరిక్షంలో వ్యోమగాములకు ముప్పుగా పరిణమించే ప్రమాదకరమైన కాస్మిక్ రేడియేషన్ నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం దీనికి ఉంది. అందుకే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్పేస్ సూట్లు, ఎలక్ట్రానిక్ స్ప్రేల తయారీలో ప్రధానంగా వాడబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంతటి అద్భుతమైన టెక్నాలజీని కేవలం ల్యాబ్ లకే పరిమితం చేయకుండా, భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఓం దివ్య దర్శన్ సంస్థాన్ సిద్ధమైంది. దీని కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఆ సంస్థ త్వరలోనే ఒక అధికారిక అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతోందని కూడా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా యూపీ వ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో భారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కేవలం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మాత్రమే కాదు.. ఇందులో మరెన్నో అంశాలు ఉన్నాయి. ఒక్కో ప్లాంట్ కు రోజూ 10 టన్నుల ఆవు పేడ, దానికి సమానంగా 10 టన్నుల నీరు అవసరం అవుతుంది. ఈ రెండింటిని కలిపి ప్రాసెస్ చేసి బయోగ్యాస్ తీశాక మిగిలిన పేడ ముద్దలో.. 22 శాతం ఘనపదార్థం, 70 శాతం ద్రవపదార్థం, 8 శాతం ఇతర పదార్థాలు ఉంటాయి. ఈ 10 టన్నుల పేడ నుంచి వీళ్లు ఏమేం తీస్తారో తెలుసా? మొదటిది నానో సెల్యులోజ్. సుమారు ఒకటిన్నర టన్నుల సాధారణ సెల్యులోజ్ వస్తుంది. రెండవది, 400 నుంచి 500 కిలోల లిగ్నిన్ . మూడవది, 3,500 నుంచి 4,000 లీటర్ల నానో ఎరువు . ఇది వ్యవసాయానికి చాలా అత్యుత్తమమైన ఎరువు. ఇవే కాకుండా, ఈ ప్లాంట్ల నుంచి పర్యావరణ అనుకూలమైన క్యాటరింగ్ ఉత్పత్తులు.. అంటే ఆవు పేడతో తయారయ్యే ప్లేట్లు, గ్లాసులు వంటి వాటిని కూడా ఉత్పత్తి చేస్తారు. మొత్తంగా ఈ ప్లాంట్ల ద్వారా పలు రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికే కాదు, దేశ , రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా భారీగా లాభం చేకూరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.