ప్రశాంతమైన అంతరిక్షంలో కూడా ఆయుధాలు మోహరింపు..!

Spread the love

ప్రశాంతమైన అంతరిక్షంలో కూడా ఆయుధాలు మోహరించే స్థితికి మానవాళి వచ్చేసింది. తాజాగా అమెరికా రక్షణ శాఖ,  యూఎస్ స్పేస్ ఫోర్స్ అధికారులు ఒక సంచలన ప్రకటన చేశారు. అంతరిక్షంలో శత్రు దేశాల దాడులను తిప్పికొట్టే  వెపన్స్ తమ దగ్గర ఉన్నాయని వారు తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు. నిజానికి 2019లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో యూఎస్ స్పేస్ ఫోర్స్ అనే ఒక కొత్త మిలిటరీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచే అమెరికా అంతరిక్షంలో మిలిటరీ పవర్ పెంచుకుంటోందనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. కానీ ఏ దేశం కూడా స్పేస్ లో ఆయుధాలు పెట్టినట్లు అధికారికంగా ఒప్పుకోలేదు. ఎందుకంటే అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. కానీ ఇప్పుడు అమెరికా స్వయంగా మా శాటిలైట్లను కాపాడుకోవడానికి మా దగ్గర ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి  అని ప్రకటించడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం.. అమెరికాలో పెరుగుతున్న భయం. ఈ రోజుల్లో భూమి మీద ఏ దేశమైనా బతకాలంటే దానికి అంతరిక్షంలో ఉన్న శాటిలైట్సే ఆధారం. జీపీఎస్ నెట్వర్క్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్, మిలిటరీ నావిగేషన్.. ఇవన్నీ శాటిలైట్ల ద్వారానే పనిచేస్తాయి. ఒకవేళ శత్రు దేశం ఏదైనా దాడి చేసి ఈ శాటిలైట్లను ధ్వంసం చేస్తే, ఆ దేశం ఒక్క క్షణంలో రాతియుగంలోకి వెళ్లిపోతుంది. అందుకే తమ శాటిలైట్లను రక్షించుకోవడానికి అమెరికా ఇప్పుడు ఓపెన్ గా ఆయుధాలతో రెడీ అవుతోంది.

అయితే ఇవి మనం భూమి మీద వాడే వెపన్స్ మాదిరి  ఉండవు. లేజర్లు, కమ్యూనికేషన్ జామర్లు తరహా ఆయుధాలై ఉండొచ్చు. ఇక గత కొన్ని నెలలుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక భయంకరమైన నివేదికను ప్రభుత్వానికి ఇస్తూ వచ్చాయని తెలుస్తోంది.  రష్యా అంతరిక్షంలో ఒక భారీ న్యూక్లియర్ యాంటీ-శాటిలైట్ వెపన్ ను డెవలప్ చేస్తోందని ఆ రిపోర్ట్ సారాంశం. ఒకవేళ రష్యా ఆ వెపన్ ను ప్రయోగిస్తే, అమెరికా నెట్వర్క్ మొత్తం కుప్పకూలుతుంది. మరోవైపు చైనా ఇప్పటికే 2007లో తమ పాత వాతావరణ ఉపగ్రహాన్ని ఒక మిస్సైల్ తో పేల్చేసి, తమ యాంటీ-శాటిలైట్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించింది. అంటే అంతరిక్షంలో రష్యా , చైనాలు విపరీతంగా బలం పెంచుకుంటూ, అమెరికా శాటిలైట్లకు నేరుగా ముప్పు తెస్తున్నాయి. అందుకే చైనా, రష్యాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి, మీరు రెచ్చిపోతే, మిమ్మల్ని అడ్డుకోవడానికి మా దగ్గర కూడా స్పేస్ లో ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి.. బి కేర్ ఫుల్  అని ఒక రకమైన సైకలాజికల్ వార్ ఫేర్ లో భాగంగానే అమెరికా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. 

అయితే అందరికీ వచ్చే సందేహం అంతరిక్షం అనేది ఏ ఒక్క దేశానికో సొంతం కాదు కదా, మరి అక్కడ ఆయుధాలు పెట్టుకోవచ్చా? చట్టాలు ఒప్పుకుంటాయా? 1967లో ఐక్యరాజ్యసమితి  ఆధ్వర్యంలో అగ్రరాజ్యాలన్నీ కలిసి ఔటర్ స్పేస్ ట్రీటీ  అనే ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ చట్టం ప్రకారం.. ఏ దేశం కూడా అంతరిక్షంలో అణ్వాయుధాలను  మోహరించకూడదు. అలాగే చంద్రుడు, ఇతర గ్రహాల మీద ఎలాంటి మిలిటరీ బేస్ లు నిర్మించకూడదు. కానీ ఈ చట్టంలో ఒక చిన్న లొసుగు ఉంది. అణ్వాయుధాలను నిషేధించారు కానీ.. లేజర్లు, కమ్యూనికేషన్ జామర్లు లాంటి సాంప్రదాయ ఆయుధాల గురించి ఈ చట్టం స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు అమెరికా, చైనా, రష్యాలు ఈ లొసుగును అడ్డుపెట్టుకునే అంతరిక్షాన్ని ఒక యుద్ధ భూమిగా మారుస్తున్నాయి. ఒకవేళ స్పేస్ లో చిన్న యుద్ధం జరిగినా.. ఆ శాటిలైట్ల ముక్కలు బుల్లెట్ల వేగంతో దూసుకెళ్లి, మిగతా వేలాది శాటిలైట్లను ఢీకొట్టి నాశనం చేస్తాయి. ఇటువంటి పరిణామాలు జరిగితే భవిష్యత్తులో మానవుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టడం దాదాపు అసాధ్యం అయిపోతుంది. దీనినే  కెస్లర్ సిండ్రోమ్  అంటారు. సాంకేతికత పెరిగేకొద్దీ మనిషి స్వార్థం అంతరిక్షాన్ని కూడా వదలడం లేదు. మరి అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం గనుక వస్తే, అది భూమి మీద కాకుండా కచ్చితంగా అంతరిక్షంలోనే జరుగుతుందా? అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *