ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో చిత్రాలతో తన విలక్షణ నటన వైవిధ్యమైన పాత్రలతో పలు భాషా చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ కు ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు దక్కింది. భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా ఈ పురస్కారాన్ని భావిస్తారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన అసమానమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 22న గుజరాత్ లోని కేవడియా (ఏక్తా నగర్) లో జరిగే 72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అనంత్ నాగ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించనున్నారు. ఈ పురస్కారాన్ని దక్కించుకున్న రెండవ కన్నడ నటుడిగా అనంత్ నాగ్ నిలిచారు. ఇక అంతకుముందు 1995లో కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కు ఈ పురస్కారం లభించింది.
అనంత్ నాగ్ 300కి పైగా సినిమాలు చేశారు. ఆయన కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, మరాఠీ, మరియు ఇంగ్లీష్ వంటి పలు భాషల్లో అలరించారు. 1973లో వచ్చిన ‘సంకల్ప’ అనే కన్నడ చిత్రం ద్వారా అనంత్ నాగ్ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1970లలో శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన అంకుర్, నిశాంత్, భూమిక, కొండుర వంటి క్లాసిక్ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ రచయిత ఆర్.కె. నారాయణ్ కథల ఆధారంగా దూరదర్శన్ లో వచ్చిన ధారావాహిక ‘మాల్గుడి డేస్’ తో బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గరయ్యారు. దీనికి ఆయన సోదరుడు శంకర్ నాగ్ దర్శకుడు. ఇక మన తెలుగులో ‘ప్రేమలేఖలు’, ‘అనుగ్రహం’, భీష్మ, ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ KGFలతో సుపరిచితులు. సినీ రంగానికి ఆయన చేసిన కృషికి గానూ కేంద్ర ప్రభుత్వం 2025లో ఆయనను దేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ తో గౌరవించింది. అలాగే ఆయన 5 సార్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెలుచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, కర్ణాటక రాజకీయాల్లోనూ తన వంతు పాత్ర పోషించారు. గతంలో ఆయన శాసనమండలి సభ్యుడిగా, మంత్రిగా కూడా సేవలు అందించారు.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోవడంపై ఆయన స్పందించారు. ఎంతో సంతోషంగా ఉందని కేంద్రానికి తన ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రధాని మోదీ అనంత్ నాగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును దక్కించుకున్న దిగ్గజ నటులు అనంత్ నాగ్ గారికి హృదయపూర్వక అభినందనలు.గడచిన కొన్ని దశాబ్దాలుగా, తమ అద్భుతమైన అభినయంతో, అద్భుతమైన వైవిధ్యంతో భారతీయ సినీ రంగంలో ప్రత్యేకించి కన్నడ సినీ పరిశ్రమలో ఆయన ఒక చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఒక విశిష్టమైన కళాకారుడికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు.