మన దేశంలో ఏ సినిమా రిలీజ్ కావాలన్నా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి తప్పనిసరి. వాళ్ళు సరే అంటేనే సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా థియేటర్లలోకి వస్తుంది. సినిమాల పరంగా ఇంత శక్తివంతమైన సెన్సార్ బోర్డును తాజాగా కేంద్ర ప్రభుత్వం సమూలంగా ప్రక్షాళన చేసింది. సెన్సార్ బోర్డులో ఉన్న పాత సభ్యులను తప్పించి,కొత్తగా 18 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ కొత్త ప్యానెల్లో బాలీవుడ్ స్టార్స్ ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి లాంటి వాళ్లతో పాటు తెలుగులో అగ్రకుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి కూడా చోటు దక్కింది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన ప్రముఖ నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకునే సుప్రియ యార్లగడ్డ కి ఈ ప్రతిష్ఠాత్మక సెన్సార్ బోర్డులో అత్యంత కీలకమైన స్థానం లభించింది. సుప్రియ ఇండస్ట్రీలో ఒక మంచి విజన్ ఉన్న ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్ లు, సినిమాలను ఆమె నిర్మించారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సెన్సార్ బోర్డులో కీలక బాధ్యతలు చేపట్టారనున్నారు.
గతంలో 2017 ఆగస్టులో ఈ బోర్డును అధికారికంగా ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం బోర్డు పదవీకాలం కేవలం మూడేళ్లు మాత్రమే ఉంటుంది. కానీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త బోర్డును నియమించకపోవడంతో 2020 తర్వాత కూడా ఆ పాత సభ్యులే తమ పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన నోటిఫికేషన్ జారీ చేసింది. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952 నిబంధనల ప్రకారం.. ఈ సెన్సార్ బోర్డును పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. దీని పదవీకాలం మళ్ళీ మూడు సంవత్సరాల పాటు ఉంటుంది లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ కొత్త ప్యానెల్ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సీబీఎఫ్సీ కి చైర్‌పర్సన్‌గా శశి శేఖర్ వెంపటి వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ఇప్పుడు ఈ 18 మంది సభ్యులు పనిచేయబోతున్నారు. 90ల నాటి అందాల తార, డింపుల్ గర్ల్ ప్రీతి జింటా ఈ కొత్త సెన్సార్ బోర్డులోకి అడుగుపెట్టింది. ఐపీఎల్ లో పంజాబ్ టీమ్ కు ఓనర్ గా క్రీడా రంగంలో యాక్టివ్ గా ఉన్న ప్రీతి.. ఇప్పుడు ప్యానెల్ మెంబర్ గా సెన్సార్ వ్యవహారాలు చూడబోతోంది. అలాగే బాలీవుడ్ అన్నా అయిన సునీల్ శెట్టికూడా ఈ 18 మంది సభ్యులలో ఒకరిగా ఎంపికయ్యారు. అన్నిటికంటే ఆసక్తికరమైన పేరు.. పంకజ్ త్రిపాఠి . మీర్జాపూర్ సిరీస్ లో కాలీన్ భయ్యాగా తన నటనతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న పంకజ్ త్రిపాఠి లాంటి అద్భుతమైన నటుడికి సెన్సార్ బోర్డులో చోటు దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ భాషలకు, రంగాలకు చెందిన దిగ్గజాలకు కూడా ఈ ప్యానెల్లో చోటు దక్కింది. దక్షిణాది నుంచి జాతీయ అవార్డు గ్రహీత, స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ రెండు సార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ కు కూడా ఈ ప్యానెల్ లో స్థానం లభించింది. వీళ్ళతో పాటు మరాఠీ నటి నిషిగంధా వాడ్, సీనియర్ బాలీవుడ్ నటుడు మనోజ్ జోషి, బెంగాలీ సూపర్ స్టార్ ప్రోసెన్జిత్ ఛటర్జీ, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత , నటి పల్లవి జోషి,రూపాళీ గంగూలీ ఇలా ఎంతో మంది ప్రతిభావంతులు ఈ జాబితాలో ఉన్నారు.
ప్రముఖ గాయకుడు మాజీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్, ఫిల్మ్ మేకర్ నీలా మాధబ్ పాండా, రైటర్స్ అభిషేక్ జైన్, యతీంద్ర మిశ్రా, రమేష్ పతంగే, థియేటర్ డైరెక్టర్ వామన్ కేంద్రే కూడా ఉన్నారు. ఇక సెన్సార్ బోర్డ్ ఇంత భారీ ప్రక్షాళన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఈ బోర్డు వల్ల సినిమాలకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది అత్యంత ముఖ్యమైన ప్రశ్న. చాలా మందికి సెన్సార్ బోర్డ్ అంటే కేవలం బూతులు కట్ చేయడం, లేదాహింసాత్మక సన్నివేశాలు ఉంటే అడల్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం అనే అనుకుంటారు. కానీ అది అంతకంటే చాలా పెద్ద వ్యవస్థ. భారతీయ సంస్కృతి, యువత పై పడే ప్రభావం, సామాజిక బాధ్యత వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఒక సినిమాను ప్రజల ముందుకు తీసుకురావాలా వద్దా అని నిర్ణయించే సుప్రీం పవర్ సెన్సార్ బోర్డు చేతిలోనే ఉంది. గత కొంతకాలంగా సెన్సార్ బోర్డ్ పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. కొన్ని సినిమాల విషయాల్లో పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో, సినిమాలను కేవలం కత్తెర వేసే కోణంలో కాకుండా, ఒక కళాత్మక దృష్టితో చూసే వ్యక్తులు బోర్డులో ఉండాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.