తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు కూటమి సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు రేపు విశాఖ పర్యటన చేయనున్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు…ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తోంది..ప్రజలకు ఇంటిపై తమ హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నారు. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వనుండడంపై లబ్ధిదారుల నుండి హర్షం వ్యక్తమవుతోంది.
ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు… 25 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది.భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది…..బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది…ఆత్మగౌరవం, భరోసా దక్కుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల కోసం రోజుకో ముందడుగు వేస్తున్నామని ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖలో….సామాన్య కుటుంబాలకు భరోసాను కల్పిస్తున్నట్లు చెప్పారు. వారిని అభివృద్దిలో భాగస్వాములు చేస్తున్నట్లు వివరించారు.
ఇక లబ్ధిదారుల నుండి ఈ ప్రకటనతో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఆందోళనతో బతికిన మా జీవితాలకు ఈ ఇళ్ల పట్టాలు ఒక పెద్ద భరోసానిచ్చాయి. కనీసం మా పిల్లలకు ఒక శాశ్వత చిరునామా ఉంటుందా లేదా అనే బెంగతో ప్రతిరోజూ నిద్రలేని రాత్రులు గడిపిన మాకు, ఈ నిర్ణయం కంటి నిండా నిద్రను మిగిల్చింది. ఏళ్ల తరబడి పడిన కష్టానికి, మా స్వంత గృహాలుగా మారే అదృష్టం దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తోందని వారు తెలుపుతున్నారు. ఒక సొంత ఇల్లు, దానికి సంబంధించిన పూర్తి హక్కుల పత్రం చేతికి వస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. పేదోళ్లకు ఇటువంటి స్థిరాస్తి దక్కడం అంటే మా ఆత్మగౌరవం పెరిగినట్లే. ఇకపై ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని, మేమూ ఈ సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలమనే నమ్మకం కలిగింది. ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి అందించిన ఈ పట్టా తమకు కేవలం ఒక కాగితం కాదు, మా తర్వాతి తరాల భవిష్యత్తుకు ఒక భద్రతగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. లబ్ధిదారుల ప్రతి ఒక్కరి మొఖంలోనూ ఇప్పుడు అదే ఆనందం ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తమ కల నిజమైందంటూ పండగ లాగా సంతోషాన్ని పంచుకుంటున్నారు. నిరుపేదల కష్టాలను అర్థం చేసుకుని, వారికి శాశ్వత భద్రత కల్పించిన ఈ మంచి నిర్ణయం తమ జీవితాల్లో నిజమైన వెలుగులు నింపిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.