దక్షిణాది సినిమాల్లో ముఖ్యంగా నేటి యూత్ లోమంచి క్రేజ్ తో దూసుకుపోతున్న కొత్త తరం హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే మొదటగా వినిపించే పేరు రుక్మిణీ వసంత్. తన మొదటి కొన్ని చిత్రాలతోనే అందరినీ ఆకట్టుకున్న ఈ కన్నడ భామ ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో అదరగొడుతోంది. రుక్మిణీ వసంత్ నటించిన సినిమాల గురించి మాట్లాడితే, ప్రశాంత్ నీల్ సమర్పణలో వచ్చిన ‘బీర్బల్ త్రిలోజీ’ (Birbal Trilogy) సినిమాతో ఆమె కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలిచిత్రంలోనే తన నటనతోనే అలరించి అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం హేమంత్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ (Sapta Sagaradaache Ello – Side A & Side B). ఈ రెండంశాల ప్రేమకావ్యంలో ‘ప్రియా’గా రుక్మిణీ కనబరిచిననటన ప్రేక్షకులనూ, సమీక్షకులనూ అమితంగా ఆకట్టుకుంది. ఈ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రుక్మిణీ వెను తిరిగి చూసుకోలేదు. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘ఏస్’ (Ace) చిత్రంలోనూ, అలాగే కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తీసిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’ లోనూ నటించింది. కాంతారాలో మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో మంచి ప్రదర్శన కనబరిచింది. ఇటీవల వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’ లో కూడా నటించింది. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘డ్రాగన్’ లో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న మరో సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చేసింది. రుక్మిణీ వసంత్ మాలాశ్రీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘మంగళగౌరి’. వెంకట్ కే నారాయణ, హేమంత్ ఎం.రావు నిర్మిస్తున్నారు. రాహుల్ పీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ను ఇటీవల సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ విడుదల చేసింది. ఇందులో “ఇద్దరు సాధారణ మహిళలు. ఒక అసాధారణ ప్రయాణం. మంగళ, గౌరి త్వరలోనే మిమ్మల్ని థియేటర్లలో కలుస్తారు” అనే క్యాప్షనన్ను పెట్టింది. రుక్మిణీ వసంత్ గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ఈ చిత్రంలో పోలీసు అధికారిగా కనిపించనుండడం ఆసక్తికరంగా ఉంది. ఇక యూత్‌లో రుక్మిణీకి ఉన్న సూపర్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పిక్స్, వీడియో క్లిప్స్ సెకన్లలో వైరల్ అవుతుంటాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో హావా చూపిస్తున్న ఈ సుందరి వరుసగా మంచి ప్రాజెక్టులు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.