ఆసక్తికరంగా ‘జాంబీ రెడ్ది 2’ నుండి ఉపేంద్ర లుక్ పోస్టర్..! 

Spread the love

కన్నడ వెండితెరపై సరికొత్త ఆలోచనలతో సరికొత్త సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఉపేంద్ర. ఒకే మూస ధోరణిలో సాగుతున్న రొటీన్ కథలను పక్కకు తోసి ఒక నటుడిగా, దర్శకుడిగా అత్యంత వైవిధ్యమైన సినిమాలలో విలక్షణ  పాత్రలు చేసి సత్తా చాటారు.  ప్రేక్షకుడి ఆలోచనా సరళిని సైతం ప్రభావితం చేసే స్థాయిలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టమైన నటుడు. వైవిధ్యాన్ని, విలక్షణతను పెద్దపీటవేసి మరీ ఆదరించే మన తెలుగువారి మనస్సులను ఉపేంద్ర తన మొదటి సినిమాతోనే గెలుచుకున్నారు. ఆయన చెప్పే అగ్రెస్సివ్ డైలాగులు తెలుగు ప్రేక్షకులలో ఎప్పటికీ నిలిచిపోయేలా నిలిచాయి. ‘రక్త కన్నీరు’, ‘హాలీవుడ్’, ‘కల్పన’ వంటి చిత్రాలతో ఆయన చూపెట్టిన నటన, వైవిధ్యమైన గెటప్‌లు తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మాతృభాష కన్నడ అయినప్పటికీ, తెలుగు హీరోల స్థాయిలో ఇక్కడ ప్రేక్షకులను అలరించగలిగారు. కేవలం సోలో హీరోగానే కాకుండా, పెద్ద సినిమాల్లో ప్రత్యేక పాత్రలతో అద్భుతంగా నటించి మెప్పించారు.  ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ‘దేవరాజ్’గా ఆయన చూపించిన గంభీరత, పవర్ ఫుల్ యాక్టింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి ‘జాంబీ రెడ్డి’ కి సీక్వెల్ గా వస్తున్న సినిమాలో ఆయన ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. డిఫెరెంట్ లుక్ లో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను సూపర్న్ ఎస్.వర్మ తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ వెబ్ సిరీస్‌లు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘రానా నాయుడు’ ఫేమ్ సుపర్ణ్ ఎస్ వర్మ ఈ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మొదటి భాగం భారీ ప్రేక్షకాదరణ పొందడంతో సీక్వెల్ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. షనాయా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన గౌర హరి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలీ, జపనీస్ ఇలా  ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *