‘రాకా’ సంచలనం… గిన్నిస్ రికార్డు 

Spread the love

‘పుష్ప’1 మరియు 2 సినిమాల తరువాత అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రతి న్యూస్ ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కించుకుని సంచలనం సృష్టించింది.  ‘రాకా’ కోసం దర్శకుడు అట్లీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విజువల్ వండర్ గా ఒక స్టాండర్డ్ సెట్ చేసిన  ‘అవతార్’ సహా ఎన్నో హాలీవుడ్ సినిమాలు  ఈ టెక్నాలజీ సాయంతోనే అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.  ఇప్పుడు ‘రాకా’ కోసం 37 మంది నటుల ఎక్స్ ప్రెషన్స్ ను  మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించి రియల్టైమ్లో షూట్ చేయడం  ద్వారా ఈ ఘనత సాధించారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను  గిన్నిస్ వరల్డ్ రికార్డు డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ కు అందజేసింది. 

ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారిక టైటిల్ రాకాను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన గుండుతో, దట్టమైన గడ్డంతో, పదునైన గోళ్లతో విడుదల చేసిన లుక్ ఆకట్టుకుంది. ఈ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. ఇక  ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ వెనుక దర్శకుడు అట్లీ ఆలోచనలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకునే వ్యూహం ఉంది. కేవలం భారతీయ మార్కెట్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే విధంగా  ఈ కథను రూపొందించినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా సుమారు రూ.800 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీపికా పదుకొనేతో పాటు ఈ చిత్రంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ నటీమణులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ సినిమా  భారతీయ సినిమా చరిత్రలో కొత్త మైలురాళ్లను అధిగమించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుండి కీలక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *