అంతరిక్ష రంగంలో చైనా దూకుడు కేవలం 45 గంటల్లో నాలుగు రాకెట్లను ప్రయోగించి రికార్డు

Spread the love

స్పేస్ సెక్టార్ లో చైనా శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల 45 గంటల్లో నాలుగు రాకెట్లను విజయవంతంగా ప్రయోగించి అరుదైన రికార్డును సృష్టించింది. ఈనెల 15-16మధ్య మూడు లాంచింగ్ సెంటర్ల నుండి ఈ ప్రయోగాలు చేసినట్లు చైనా తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ కమర్షియల్ స్పేస్ కంపెనీలు కూడా ఈ ప్రయోగాల్లో భాగస్వామ్యం కావడం విశేషం.ఈ ప్రయోగాలు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. మొదటి ప్రయోగం జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి జరిగింది. ల్యాండ్‌స్పేస్ సంస్థకు చెందిన జుక్యూ-2ఈ రాకెట్ పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లో పట్టు సాధించేందుకు చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ రకమైన వేగవంతమైన ప్రయోగానికి బలమైన ఆర్థిక మరియు సాంకేతిక పునాదిని ఏర్పరిచినట్లు తెలుస్తోంది. 

కేవలం భూమి మీద నుంచే కాకుండా సముద్రం నుంచి కూడా చైనా తన ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. షాంఘై తీరానికి సమీపంలో ఏర్పాటు చేసిన సముద్ర వేదిక నుంచి ఓరియన్‌స్పేస్ సంస్థ గ్రావిటీ-వన్ రాకెట్‌ను ప్రయోగించింది. దీని ద్వారా మరో తొమ్మిది కియాన్ ఫాన్ ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ కూడా ఈ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించింది. వెన్‌చాంగ్ లాంచ్ సైట్ నుంచి లాంగ్ మార్చ్ 12 రాకెట్ ద్వారా తొమ్మిది అంతరిక్ష నౌకలను శాట్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ కోసం ఆర్బిట్  లోకి పంపారు. ఈ ప్రయోగాలు సమన్వయంతో కూడిన యాక్షన్ ప్లాన్ తో చేపట్టడం దీనివల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ ఉపగ్రహాల మోహరింపు సాధ్యపడుతుందని ఏరోస్పేస్ నిపుణులు పేర్కొంటున్నారు. చైనా తన అంతరిక్ష మౌలిక వసతులను అత్యంత వేగంగా విస్తరిస్తూ  కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లపై వేగంగా  వ్యూహాత్మకంగా అగ్రగామిగా నిలిచేలా అడుగులు వేస్తోందని అంతర్జాతీయ రక్షణ మరియు అంతరిక్ష నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా చేపడుతున్న ఈ వరుస ప్రయోగాల వెనుక పెద్ద ప్రణాళికే ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతరిక్ష వాణిజ్యంలో చైనా మరింత ఆధిపత్యం కనిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే దశాబ్దంలో ఈ పరిణామాలు ప్రపంచ అంతరిక్ష ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష రంగంలో వాణిజ్య పోటీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్ర పరిశోధనల దిశను పూర్తిగా మార్చగలవని అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *