గుళ్లో తీసుకునే తీర్థం ఆంతర్యం..!

Spread the love

తీర్థం ప్రాముఖ్యత ఏమిటి?
ఆలయానికి వెళ్లినప్పుడు తీర్థం తీసుకోవడం పరిపాటి. నీరే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అలాంటి నీటిని తీసుకొంటే వాతపిత్త దోషాలు పోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. నీటిని శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అలాంటి నీటిని తీసుకొంటే వాతపిత్త దోషాలు పోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. దానివల్ల శక్తి, పుష్టి సైతం కలుగుతాయన్నది మన పెద్దల మాట.

గుడికి వెళ్తే ప్రసాదం తీసుకున్నా లేకపోయినా.. తీర్థం తప్పకుండా తీసుకుంటాం. పూజారిగారు మరేదో వ్యాపకంలో ఉంటే అడిగిమరీ తీసుకుంటాం. ఎందుకంటే తీర్థం అంత అమూల్యమైంది, శ్రేష్ఠమైంది కూడా.

తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేతిని గోకర్ణంలా (ఆవు చెవి ఆకృతి) పెట్టాలి. అంటే చేతిని డిప్పలా ముడిచి, చూపుడు వేలును బొటనవేలుకు ఆనించాలి. అంతేతప్ప ఒక చేయి, లేదా రెండు చేతులను దోసిళ్ళలా పట్టకూడదు. ఉద్ధరణితో మూడుసార్లు తీర్థం పోసిన తర్వాత కళ్లకు అద్దుకుని తాగాలి. మనసులో దేవుడ్ని స్మరించుకుంటూ నిశ్శబ్దంగా సేవించాలి.

దేవునికి శుద్ధోదక అభిషేకం చేసేందుకు కొన్ని తులసి దళాలు, కొద్దిగా పచ్చ కర్పూరం, కేసరి, శ్రీగంధం వేసి కలిపిన నీటిని సిద్ధంగా ఉంచుకుంటారు. దేవుడ్ని అభిషేకించిన తర్వాత ఆ నీటిని తీర్థంగా ఇస్తారు. తీర్థంలో ఉపయోగించే కర్పూరం, తులసి దళాలు మొదలైన ద్రవ్యాలు దివ్య ఔషధంలా పని చేస్తాయి. మనలో నాడీ మండలంలోని దోషాలను సరిచేస్తాయి. తులసి అనేది కఫం లాంటి శ్వాసకోశ సంబంధమైన అనారోగ్యాలను నివారిస్తుంది. కర్పూరం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

స్వామి తీర్థాన్ని పుచ్చుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతాడని పరమపురుష సంహిత మనకు వివరిస్తోంది. తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రోగాలను పోగొడుతుందిట. అకాల మృత్యువు సంభవించకుండా రోగాల్ని, పాపాల్ని హరించమనే ఉద్దేశంతో ప్రార్థనతో ఈ తీర్థం తీసుకొంటారు.

రాగి లేదా తామ్ర పాత్రల్లో తీర్థాన్ని తయారు చేస్తారు. ఈ లోహ పాత్రల్లోనే తీర్థం ఎందుకు తయారుచేయాలంటే.. దీనికి ఉష్ణాన్ని తగ్గించి, లవణాలను గ్రహించే గుణం ఉంటుంది కాబట్టి రాగి నీటిని శుభ్రం చేసి, సమశీతోష్ణస్థితిలో ఉండేలా చేస్తుంది. ఈ కారణం వల్లే కొందరు రాత్రిపూట రాగి పాత్రలో నీరు పోసి, ఉదయానే తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోని ఇతర కల్మషాలను పోగొడుతుంది.