
త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు హంగులు, ఆర్భాటాలూ ఏమీ అక్కర్లేదు. త్రయోదశి వ్రతం చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసినవారికి ఫలితం గొప్పగా ఉంటుంది. అయితే ఇది సుదీర్ఘకాలంపాటు చేయాల్సిన వ్రతం అని గమనిస్తే చాలు.
ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశుల్లో.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) ఈ త్రయోదశి వ్రతం చేయాలి. అలా 11 సంవత్సరాలపాటు కొనసాగింపుగా ఆచరించాలి. ఏదైనా కారణాల వల్ల మధ్యలో చేయలేకపోతే ఉద్యాపన చేసి ప్రతిమను విసర్జించవచ్చు.
ఇంతకీ త్రయోదశి వ్రతం ఏంటంటే..
దీనిని త్రయోదశినాడు చేస్తారు కాబట్టే త్రయోదశి వ్రతం అని, శివపూజ, రాత్రి పూట భోజనం చేయడం వల్ల ప్రదోష వ్రతంగా పిలుస్తారు.
త్రయోదశి వ్రతం శివుడ్ని ఆరాధించేందుకు చేస్తారు. ఆయన్ను ఉద్దేశించి ఈ వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నమవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. ముఖ్యంగా ఉద్యోగంలో, వృత్తిలో అధికారం, హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతంను ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో శ్రద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు, భోగభాగ్యాలు ఇలా వేటికీ కొదవ ఉండదని చెబుతారు.
అన్ని పూజలు, వ్రతాలలాగే త్రయోదశి వ్రతాన్ని ఉదయం వేళ పాటించరు. సూర్యాస్తమయం నుంచి రాత్రి రెండు ఘడియలలోపు ఈ పూజను చేస్తారు. ఏ నెలలో అయినా త్రయోదశి నాడు ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసి వచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుందని తెలుసుకోవాలి.
సూర్యుడు అస్తమిస్తోన్న సమయంలో తలస్నానం చేయాలి. పూజా మందిరాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కుకు ముఖం పెట్టి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. మందిరంలో శివుని విగ్రహాన్ని లేదా పటిమను ఉంచాలి. ఒకవేళ పరమేశ్వరుని ప్రతిమ లభించకపోతే తడిమట్టితో మహాశివుని రూపాన్ని రూపొందించుకుని ‘శూలపాణయే నమః’ అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్టించాలి.
శుద్ధోదకం, పుష్పాలు, గంధం, అక్షతలు మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి. మెడలో రుద్రాక్షమాల వేసుకుని నుదుట విభూతిని దిద్దుకోవాలి.
శివుని ప్రతిమకు ఎదురుగా కూర్చుని ‘మమ శివ ప్రసాద ప్రాప్తి కామనయా ప్రదోష వ్రతాం గీభూతం శివ పూజనం కరిష్యే’ అని సంకల్పం మనసులో చెప్పుకోవాలి.
గంధం, పూలు, అక్షతలతో మహాశివుడ్ని భక్తిగా పూజించాలి.
‘పినాకపాణయే నమః’ అంటూ ఆవాహన చేయాలి.
‘శివాయనమః’ అంటూ అభిషేకం చేయాలి.
‘పశుపతయే నమః’ అంటూ గంధం, పుష్పాలు, అక్షతలు, ధూపదీప నైవేద్యాలను చివరగా సమర్పించాలి.
క్షీరసాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో దాచుకుని లోకాల్ని కాపాడాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలన్న సంకల్పంతో దేవతలందరూ కూడా ఆయన దగ్గరకు ఈ తిధి నాడే వెళ్లడం జరిగింది. అందువల్లే త్రయోదశి తిథికి ఎంతో విశిష్టత ఉందని శివపురాణం మనకు చెబుతోంది.