బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ ఆలయాలు..!!

Spread the love

బంగ్లాదేశ్‌లో కొత్త కరెన్సీ నోట్లు విడుదల చేసింది. ఈ కొత్త నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలను చేర్చారు. ఇంతకీ ఈ చిత్రాలను ఎందుకు చేర్చారు? గతంలో ఈ నోట్లపై ఎవరి ఫోటోలు ఉండేవి, వాటిని ఎందుకు తొలగించారు? ఈ నోట్లను ఎవరు ముద్రిస్తారు? ఇతర దేశాల్లో హిందూ చిత్రాలు కరెన్సీ నోట్లపై ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి?

జూన్ 1 నుంచి బంగ్లాదేశ్‌లో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నోట్లలో 20, 50, 1000 టాకా నోట్లు మొదట విడుదలయ్యాయి. ఈ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలను చేర్చారు. 20 టాకా నోటుపై కాంతాజీ హిందూ ఆలయం, బౌద్ధ ఆలయాల చిత్రాలు, 50 టాకా నోటుపై అటియా మసీదు, జైనుల్ ఆబెదీన్ అనే కళాకారుడి కళాఖండం, 1000 టాకా నోటుపై బంగభవన్, నేషనల్ మార్టిర్స్ మెమోరియల్ చిత్రాలు ఉన్నాయి. ఇతర నోట్లలో 100 టాకా నోటుపై సుందర్‌బన్స్‌లోని జింక, పులి చిత్రాలు, 200 టాకా నోటుపై మసీదు, ఆలయం, చర్చి, పగోడా వంటి మత సామరస్య చిహ్నాలు, 500 టాకా నోటుపై ఐతిహాసిక అహ్సన్ మంజిల్ చిత్రాలను చేర్చారు. ఈ నోట్లు బంగ్లాదేశ్ సంస్కృతి, సహజ సౌందర్యం, చారిత్రక స్థలాలను ప్రతిబింబించేలా రూపొందించారు. అయితే, ఈ హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలను ఎందుకు చేర్చారు? బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి అరిఫ్ హుస్సేన్ ఖాన్ చెప్పినట్లు, ఈ కొత్త నోట్లలో ఎలాంటి వ్యక్తుల ఫోటోలనూ చేర్చకుండా, దేశ సహజ సౌందర్యం, సాంప్రదాయ స్థలాలను చూపించాలని నిర్ణయించారు. బంగ్లాదేశ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్నప్పటికీ, హిందూ, బౌద్ధ మతాలకు చెందిన చారిత్రక స్థలాలు దేశ వారసత్వంలో భాగం. అందుకే కాంతాజీ ఆలయం వంటి హిందూ ఆలయాలు, బౌద్ధ ఆలయాలను చేర్చారు. ఇది దేశంలోని మత వైవిధ్యాన్ని, సాంస్కృతిక సామరస్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే, కొందరు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, ఆమె నాయకత్వంలో జరిగిన మైనారిటీలపై దాడుల విమర్శల నేపథ్యంలో, ఈ చర్య ఒక రకమైన డామేజ్ కంట్రోల్‌గా కూడా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.

గతంలో బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లపై ఎవరి ఫోటోలు ఉండేవి, వాటిని ఎందుకు తొలగించారు..? 1972లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి, దేశ స్థాపకుడు, బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటోను కరెన్సీ నోట్లపై చేర్చారు. ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనా తండ్రి. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలుస్తారు. 1972లో విడుదలైన మొదటి నోట్లలో అతని ఫోటోను చేర్చారు. అప్పటి నుంచి, ముఖ్యంగా అవామీ లీగ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అన్ని నోట్లపై ముజిబుర్ రెహమాన్ ఫోటోను చేర్చడం ఒక సంప్రదాయంగా మారింది. కానీ, 2024 జులైలో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. విద్యార్థుల నేతృత్వంలోని జులై తిరుగుబాటు తర్వాత హసీనా భారత్‌కు పారిపోయారు. ఆ తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ తిరుగుబాటు సమయంలో ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు, ఫోటోలు ధ్వంసం చేయబడ్డాయి. అతని వారసత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో నోట్ల నుంచి ముజిబుర్ రెహమాన్ ఫోటోను తొలగించాలని నిర్ణయించింది. కొత్త నోట్లు 6 నెలల్లో మార్కెట్‌లోకి వస్తాయని, అందులో ముజిబుర్ రెహమాన్ ఫోటో ఉండదని అప్పట్లో తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ కారణాల వల్ల తీసుకున్నారని, ముజిబుర్ రెహమాన్, హసీనా వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నమని అంటున్నారు.

బంగ్లాదేశ్ లో నోట్లను ఎవరు ముద్రిస్తారు.? బంగ్లాదేశ్‌లో కరెన్సీని టాకా అంటారు. అంటే భారతదేశంలో రూపాయి లాగా. బంగ్లాదేశ్‌లో కరెన్సీ నోట్లను సెక్యూరిటీ ప్రింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ముద్రిస్తుంది. ఈ సంస్థ బంగ్లాదేశ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 10 టాకా, అంతకంటే ఎక్కువ విలువ ఉన్న నోట్లను బంగ్లాదేశ్ బ్యాంక్ నియంత్రిస్తుంది. అయితే 2, 5 టాకా నోట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. అయితే, ఈ కొత్త నోట్ల ముద్రణలో అంతర్జాతీయ సహకారం కూడా ఉంది. కొత్త నోట్లకు కాగితం యూరప్ నుంచి సరఫరా అవుతుంది. డిజైన్, సెక్యూరిటీ ఫీచర్స్, ఇతర అంశాల్లో కూడా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. గతంలో, 1972లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్‌కు సొంత ప్రింటింగ్ ప్రెస్ లేకపోవడంతో భారత్‌లోని నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో నోట్లను ముద్రించారు. ఆ తర్వాత, థామస్ డి లారూ అనే ఇంగ్లండ్ సంస్థ కూడా బంగ్లాదేశ్ నోట్లను ముద్రించింది. అయితే, ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనే సెక్యూరిటీ ప్రింటింగ్ కార్పొరేషన్ ఈ పనిని చేస్తోంది. అయినప్పటికీ, ఏటా 150 కోట్ల నోట్లు అవసరం ఉన్నా, ఈ మింట్ 120 కోట్ల నోట్లు మాత్రమే ముద్రించగలదు, దీనివల్ల కొత్త నోట్ల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. 2025 ఏప్రిల్‌లో ముజిబుర్ రెహమాన్ ఫోటోలతో ఉన్న 15,000 కోట్ల టాకా విలువైన నోట్లను విడుదల చేయకుండా ఆపేశారు, దీనివల్ల మార్కెట్‌లో నోట్ల కొరత ఏర్పడింది.

ఇతర దేశాల్లో హిందువులకు సంబంధించిన చిత్రాలు కరెన్సీ నోట్లపై ఉన్నాయా? ఇండోనేషియాలో, 20,000 రూపియా నోటుపై గణేషుడి చిత్రం ఉంది. ఇండోనేషియా ముస్లిం దేశం, 87% మంది ముస్లింలు ఉన్నప్పటికీ, హిందూ సంస్కృతి అక్కడ చారిత్రకంగా ఎంతో ప్రభావం చూపింది. మొదటి శతాబ్దం నుంచి ఇండోనేషియాకు భారత్‌తో సంబంధాలు ఉన్నాయి. హిందూ, బౌద్ధ మతాలు అక్కడకు వ్యాపించాయి. 16వ శతాబ్దం వరకు హిందూ-బౌద్ధ రాజ్యాలు అక్కడ ఆధిపత్యం చెలాయించాయి. రామాయణం, మహాభారతం కథలు అక్కడ ప్రసిద్ధం. అర్జునుడు, హనుమాన్ వంటి పాత్రలు ఇండోనేషియా సంస్కృతిలో భాగమైనవి. బాలిలోని గరుడ విష్ణు కెంచన విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు విగ్రహం. ఈ చారిత్రక, సాంస్కృతిక సంబంధాల వల్ల ఇండోనేషియా కరెన్సీపై గణేషుడి చిత్రాన్ని చేర్చారు. ఇండియాలో కూడా కరెన్సీ నోట్లపై హిందూ ఆలయాల చిత్రాలు ఉన్నాయి. 20 రూపాయి నోటుపై ఎల్లోరా గుహలు, 50 రూపాయి నోటుపై హంపీ ఆలయం, 100 రూపాయి నోటుపై రాణీ కీ వావ్, 200 రూపాయి నోటుపై సాంచీ స్తూపం చిత్రాలు ఉన్నాయి. ఎల్లోరా గుహలు హిందూ, బౌద్ధ, జైన ఆలయాల సమ్మేళనం. ఈ చిత్రాలను చేర్చడం వెనుక కారణం, భారతదేశ వారసత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని చూపించడం లక్ష్యం. అన్ని నోట్లపై ఉన్న స్థలాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లు. ఇది దేశంలోని మత, సాంస్కృతిక సమతుల్యతను ప్రతిబింబిస్తుంది.